పెరుగుతున్న కేసుల వేళ.. గాంధీ కీలక నిర్ణయం

Update: 2020-06-02 04:30 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాయదారి రోగానికి చికిత్స అందించే ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి తాజాగా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంది. రోజు గడిచేసరికి దగ్గర దగ్గర వంద కేసులకు తగ్గకుండా పాజిటివ్ లు పెరుగుతున్న వేళ.. ఇప్పటివరకూ 1200 వరకు ఉన్న పడకల సంఖ్యను మరో 350 బెడ్స్ పెంచేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సడలింపులు పెద్ద ఎత్తున మినహాయించిన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దీంతో.. రానున్న రోజుల్లో పెరిగే రద్దీకి అనుగుణంగా గాంధీలో 350 బెడ్లను సిద్దం చేయటం ద్వారా.. రానున్న కొద్ది రోజుల్లో అవసరానికి సరిపడేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణలోని లైబ్రరీ.. సెమినార్ హాల్స్ భవన సముదాయంలో 200 పడకలు.. ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగంలో మరో 150 పడకల్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో.. 1500కు పైగా పడకలు గాంధీలో ఉన్నట్లు అవుతుంది.

దీనికి తోడు కింగ్ కోఠి ఆసుపత్రి.. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రితో పాటు.. పలు ఆసుపత్రుల్ని సిద్ధం చేస్తున్నారు. పడకల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గాంధీ వైద్యులు మరిన్ని అంశాల్లోనూ త్వరత్వరగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం పాజిటివ్ కేసులకు చికిత్స చేస్తున్న గాంధీ వైద్యులు రానున్న రోజుల్లో తీవ్రత తక్కువగా ఉన్న వారికి చికిత్స చేసే అవకాశం లేదంటున్నారు. అంతేకాదు.. పాజిటివ్ గా తేలిన వారిలో ఆరోగ్యం కుదుట పడి.. నార్మల్ గా ఉన్న వారిని వెంటనే డిశ్చార్జి చేస్తారని చెబుతున్నారు.

రోజు గడిచే కొద్దీ కొత్త పేషెంట్లు పెద్ద ఎత్తున వస్తున్న వేళ.. గతంలో మాదిరి వైద్యం చేయటం సాధ్యం కాదంటున్నారు. అందుకే.. ఎవరింట్లో వారు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకునేలా సూచనలుచేసి.. ఇంటికి పంపాలన్న యోచనలో గాంధీ వైద్యులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తెలంగాణలో పోలీసులకు.. వైద్యులకు.. వైద్య విద్యార్థులకు పాజిటివ్ గా రావటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళ సై సైతం ఇదే ఆందోళనను వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News