కొత్త జిల్లాల్లో వాస్తు దోషాలు?

Update: 2016-10-12 07:05 GMT
పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా మార్చిన సీఎం కేసీఆర్  జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రకాల సమీకరణాలు చూసుకున్నారని.. ముఖ్యంగా వాస్తుపరంగా బాగా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నేత వీహెచ్ వంటివారు కూడా గతంలో కేసీఆర్ పై ఇవే ఆరోపణలు చేశారు.  వనరులు - భౌగోళిక అనుకూలతల కోణంలో కాకుండా పూర్తిగా వాస్తు కోణంలో జిల్లాలను విభజించారని ఆయన ఆరోపించారు. కానీ... కొన్ని జిల్లాలకు మాత్రం వాస్తు దారుణంగా ఉందని.. అది ఎలాంటి అరిష్టం తెస్తుందో కూడా తెలియదని అంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విడగొట్టిన తరువాత మిగిలిన కొత్త కరీంనగర్ జిల్లా వాస్తు ఏమీ బాగులేదని పండితులు అంటున్నారు. దీంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

అవశేష కరీంనగర్ జిల్లాకు తీవ్ర వాస్తు దోషం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను  రమణాచార్య స్వామి అనే వాస్తు పండితుడు కలిసి.. జిల్లా ముందున్న వాస్తు సమస్యను తెలిపారట. గతంలో వాస్తు బాగున్నందునే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ఇప్పుడు నైరుతిలో మానేరు జలాశయం - పడమర మిడ్ మానేరు జలాశయాలు రావడం దోషమని - ఉత్తర - ఈశాన్యాన భూమి కోత పడటం - తూర్పు - దక్షిణ - ఆగ్నేయ ప్రాంతాలు పెరగడం మంచిది కాదని చెప్పుకొచ్చారట. దీనివల్ల ఎంతో అనర్థమని - అరిష్టాలు జరగవచ్చని హెచ్చరించారట.

అయితే.. కేసీఆర్ కు చెప్పి ఇప్పటికిప్పుడు మళ్లీ కొత్త కరీంనగర్ జిల్లా భౌగోళిక స్వరూపం మార్చడం సాధ్యంకాదు కాబట్టి దోష నివారణ దిశగా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం నైరుతి దిక్కున 100 అడుగుల ఎత్తయిన అష్ట దిక్పాలక వాస్తు స్థూపం నిర్మించబోతున్నారట. ఎమ్మెల్యే గంగుల సైతం దీనికి ఓకే చెప్పారట. ఇక మిగిలిన జిల్లాల్లోనూ ఎలాంటి దోషాలు బయటకొస్తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News