ప్రత్యేక హోదా ఇచ్చారు...తీసేశారు...?

Update: 2022-02-12 15:44 GMT
అదేంటో ప్రత్యేక హోదా అంటే ఎపుడూ ప్రత్యేకమే అని తనకు తానుగా  చాటుకుంటోంది. కేంద్ర హోం శాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదాను ఒక అంశగా చేర్చారు. ఇది ఒక హట్ న్యూస్ గా  ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొన్ని గంటల పాటు తెలుగు మీడియా అంతా తెగ వైరల్ అయింది. ఎనిమిదేళ్ల కల ఇలా తీరబోతోంది అని అంతా సంతోషించారు.

ఇక అధికార వైసీపీ నేతలు అయితే ఇదంతా వైఎస్ జగన్ కృషి అని ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇలా అంతా ఆనందడోలికల్లో ఉండగా సీన్ కట్ చేస్తే ఈవెనింగ్ కల్లా కేంద్ర  హోం శాఖ అజెండాలో పెట్టిన ప్రత్యేక హోదా మాయం అయిపోయింది. ఎనిమిదవ అంశంగా హోదాను పెట్టిన కేంద్ర హోం శాఖ దాన్ని తొలగిస్తూ లేటెస్ట్ గా మరో  సర్క్యులర్ విడుదల చేసింది.

దీని మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ ఎంపీల మీద వేసిన సెటైర్లు అయితే ఒక లెవెల్ లో ఉన్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడి ఏదో సాధించారు అనుకున్నాను సుమా. ఇక  టీవీలో హోదా మీద  వచ్చిన వార్తలు చూసి చాలా సంతోషించాను. తీరా ఆరా తీస్తే ప్రత్యేక హోదా అంశం అన్నది వేరే లేదని తేలింది అన్నారు.

అవును కానీ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలనుకుంటే తెలంగాణా రాష్ట్రంతో చర్చించాలా అని లాజిక్ పాయింట్ ని కూడా ఆయన లేవదీశారు. తెలంగాణా, ఏపీ రాష్ట్రల  మధ్య ఉన్న విభజ‌న సమస్యలు చర్చించడానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శితో ఏర్పాటు చేసిన కమిటీలో ప్రత్యేక హోదా ఎలా ఉంటుంది అనుకున్నారు అని ఆయన అడిగిన దాంట్లో లాజిక్ ఉంది మరి.

మరి ఈ చిన్న  లాజిక్ ని వైసీపీ నేతలు  మిస్ కావడమే కాదు, పొద్దుట నుంచి టీవీల్లో డిబేట్లు, వైసీపీ అయితే తమ అనుకూల మీడియాలో ఊదరగొట్టుడుతో ఏపీ జనాల్లో కొత్త ఆశలే రేకెత్తించేశారు.  మొత్తానికి చూస్తే హోదా లేదూ ఏమీ లేదు. అయినా కానీ వైరల్ అయిన న్యూస్ వల్ల ఏపీ జనాలకు కొన్ని గంటల పాటు హోదా ఆశలైతే మొలకెత్తి ఉత్సాహం ఇచ్చాయి అనుకోవాలి. అంతే.


    
    
    

Tags:    

Similar News