గిరీష్ కర్నాడ్ కు క్షమాపణలు చెప్పక తప్పలేదు

Update: 2015-11-12 05:44 GMT
టిప్పు సుల్తాన్ వివాదంలో మాట జారిన మరో ప్రముఖుడు నాలుక్కర్చుకున్నారు. టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సావాల్ని కర్ణాటక సర్కారు అధికారికంగా నిర్వహించే అంశం కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై గొడవలు జరగటం.. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి.. ఒక వీహెచ్ పీ కార్యకర్త మరణించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బెంగళూరు విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలంటూ మరో వివాదానికి తెర తీశారు ప్రముఖ సినీరంగ నటుడు.. కళాకారుడు గిరీష్ కర్నాడ్. ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయానికి గార్డెన్ సిటీ వ్యవస్థాపకులు కెంపెగౌడ్ పేరుంది. ఆ పేరు స్థానే టిప్పుసుల్తాన్ పేరు పెట్టాలంటూ ఇప్పుడున్న గొడవలు చాలవన్నట్లుగా ఆయన వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

కర్నాడ్ చేసిన వ్యాఖ్య మరింత మంట పుట్టించింది. ఆయన చేసిన ప్రతిపాదపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పెద్ద మనిషి అయి ఉండి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారా? అంటూ విరుచుకుపడటం.. పలువురు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో గిరీష్ కర్నాడ్ కాస్త వెనక్కి తగ్గారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని.. తాను ఎవరినీ బాధించి ఉండాలన్న ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. అయినా.. వివాదాలు చాలవన్నట్లుగా మేధావులు సైతం కొత్త కొత్త వివాదాల్ని తెరపైకి తీసుకొస్తే. ఎలా? టిప్పు సుల్తాన్ మీద అంత అభిమానమే ఉంటే.. గిరీష్ కర్నాడ్ తన ఇంటికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు కదా..?
Tags:    

Similar News