రుషికొండ తవ్వకాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల హాట్‌ కామెంట్స్‌!

Update: 2022-12-13 10:41 GMT
విశాఖపట్నంలో రుషికొండ నిర్మాణాలపై 'వాటర్‌ మ్యాన్‌' రాజేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

''కొందరు రాజేంద్ర సింగ్‌ను తప్పుదారి పట్టించడం దురదృష్టకరం. ఇది విశాఖను ఏపీకి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మార్చకుండా జరిగిన కుట్రలో భాగమే. గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 33 వేల ఎకరాల అమరావతి రాజధానిని విమర్శించిన వ్యక్తి రాజేంద్ర సింగ్‌. విలువైన వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ కోసం సేకరించారు' అంటూ సజ్జల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రుషికొండ తవ్వకాల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపైనా సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండ తవ్వకాలు ఏమైనా అంతర్జాతీయ సమస్యనా అని ప్రశ్నించారు.

రుషికొండను టన్నులు, కిలోలు లెక్కగట్టి తవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలనే కుట్రతోనే రాజేంద్రసింగ్‌ లాంటి ఉద్యమకారులతో రుషికొండపై ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు.

 ''విశాఖలో రామానాయుడు స్టూడియోస్, మిలీనియం టవర్స్‌కి రోడ్లు ఎలా వేశారు? ఈ ప్రాంతాలకు రోడ్ల కోసం రుషికొండలో పర్యావరణ నిబంధనలు పాటించకుండా తవ్వకాలు చేపట్టారు. గత ప్రభుత్వాల హయాంలో ఇదే స్థలంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రభుత్వాన్ని మించిన వ్యవస్థ లేదు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థ'' అని సజ్జల తెలిపారు.

దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని రాజకీయ పార్టీగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తే మంచిదేనని సజ్జల అన్నారు. ఒక వేళ కేసీఆర్‌ మా మద్దతు కోరితే అందరితో చర్చించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సజ్జల పునరుద్ఘాటించారు.

రుషికొండ విధ్వంసంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, సీపీఐ నేత నారాయణ అభ్యంతరం వ్యక్తం చేసినా వైసీపీ ప్రభుత్వం చలించలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News