గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ కు మాతృవియోగం

Update: 2017-10-20 16:44 GMT
ఏపీ - తెలంగాణ‌ల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న మాతృమూర్తి విజయలక్ష్మి శ్రీనివాసన్ (94) తుదిశ్వాస విడిచారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌రైన కుమారుడితోనే క‌లిసి హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో ఉంటున్న ఆమె..వ‌య‌సు రీత్యా కొంత కాలంగా అనారోగ్యంతో ఉంటున్నారు. దీంతో రాజ్‌ భ‌వ‌న్‌ లోని వైద్య శాల‌లోనే ఓ ప్ర‌త్యేక వైద్యుడిని ఏర్పాటు చేసి ఆమెకు వైద్యం అందిస్తున్నారు. గురువారం జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌లోను కొన్ని నిముషాలు గ‌డిచిన విజ‌య‌ల‌క్ష్మి.. అనంత‌రం ఆహారం తీసుకుని నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. శుక్ర‌వారం తెల్ల‌వారి కుటుంబ స‌భ్యులు ఆమెను నిద్ర లేపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె స్పందించ‌లేదు.

దీంతో వెంట‌నే వైద్యుడిని పిలిచి ప‌రీక్షించారు. అప్ప‌టికే ఆమె నిద్ర‌లోనే తుది శ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ మాతృమూర్తి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌ భవన్‌ కు వెళ్లి..  విజ‌య‌ల‌క్ష్మి భౌతికకాయానికి పుష్పగుచ్ఛం స‌మ‌ర్పించి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట ప‌లువురు మంత్రులు కూడా హాజ‌రై.. నివాళులు అర్పించారు. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్క‌డి నుంచే ఫోన్ చేసి.. గ‌వ‌ర్న‌ర్‌ కు సంతాపం ప్రకటించారు. అనంతరం పలువురు అధికార అనధికార ప్రముఖులు రాజ్‌ భవన్‌ కు వెళ్ళి గవర్నర్‌ కు సానుభూతి తెలిపారు. విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్ర‌వారం హైదరాబాదులోని పంజాగుట్ట స్మశానవాటికలో జరిగాయి.  ఈ మేరకు రాజ్‌ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, విజ‌య‌ల‌క్ష్మిత‌మిళ‌నాడుకు చెందిన వారు.
Tags:    

Similar News