సోష‌ల్ మీడియ‌తో ట‌చ్ లేదా గ‌వ‌ర్న‌ర్ సాబ్‌?

Update: 2017-08-16 05:44 GMT
ప్ర‌జాజీవితంలో ఉన్న వారు త‌ప్ప‌నిస‌రిగా ఫాలో కావాల్సిన వాటిల్లో సోష‌ల్ మీడియా ఒక‌టి. గ‌తంలో న్యూస్ పేప‌ర్లు.. త‌ర్వాతి కాలంలో వ‌చ్చిన టీవీ ఛాన‌ళ్ల‌ను ఫాలో అయ్యేవారు.  ఎప్పుడైతే సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇచ్చిందో.. చాలా త్వ‌ర‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌ట‌మే కాదు.. చాలా రాజ‌కీయ‌.. సామాజిక ప‌రిణామాల‌కు అదో వేదిక‌గా మారింది.

దీంతో ప్ర‌ముఖులంతా త‌మ‌కు అల‌వాటు ఉన్నా లేకున్నా సోష‌ల్ మీడియాను ఫాలో అవుతున్నారు. డిజిట‌ల్ మీద పెద్ద‌గా ఆస‌క్తి లేని ప్ర‌ముఖులు సైతం డ‌బ్బులిచ్చి మ‌రీ కొంద‌రిని ప్ర‌త్యేకంగా నియ‌మించుకుంటున్న ప‌రిస్థితి. మిగిలిన రంగాల సంగ‌తి ఎలా ఉన్నా..రాజ‌కీయ.. సినిమా రంగాల్లో ఉన్న వారు త‌ప్ప‌నిస‌రిగా సోష‌ల్ మీడియాను ప‌క్కాగా ఫాలో కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎక్క‌డేం జ‌రిగినా వెంట‌నే ఆ విష‌యం మీద చ‌ర్చ‌లు.. వాద‌న‌లు.. త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఎప్పుడేం వైర‌ల్ అవుతుంద‌న్న విష‌యాలు తెలుసుకోవ‌టానికి సోష‌ల్ మీడియా త‌ప్ప‌నిస‌రైంది. సోష‌ల్ మీడియాను ఆయుధంగా చేసుకొని 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ఎంత మేజిక్ చేశారో తెలిశాక‌.. రాజ‌కీయ నేత‌ల్లో సోష‌ల్ మీడియా అటెన్ష‌న్ మ‌రింత పెరిగింది.

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ సోష‌ల్ మీడియాను రెండు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఫాలో కారా? అంటే అవున‌నే స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చూస్తే.. సోష‌ల్ మీడియానే కాదు.. రెగ్యుల‌ర్ న్యూస్ అప్డేట్స్ తో పాటు.. మీడియాను కూడా పెద్ద‌గా ఫాలో కావ‌టం  లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఆ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ప్రైవేటుగా క‌ల‌వ‌టం.. వారిద్ద‌రూ ప‌లు అంశాల మీద మాట్లాడుకోవ‌టం తెలిసిందే. ఈ విష‌యాల్ని వారే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టుకున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారిని విప‌రీతంగా ఆక‌ర్షించింది.

రాజ‌కీయంగా భిన్న ధ్రువాలైన ప‌వ‌న్‌.. కేటీఆర్ లు భేటీ కావ‌టం.. ప‌లు అంశాల మీద తాము మాట్లాడుకున్నామ‌ని చెప్ప‌టంపై ప‌లు ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ విష‌యం మీడియాలోనూ ప్ర‌ముఖంగానే ప్ర‌స్తావించారు. కానీ.. ఇదేమీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దృష్టికి వ‌చ్చిన‌ట్లుగా లేదు. ఎందుకంటే.. తాజాగా నిర్వ‌హించిన ఎట్ హోం కార్య‌క్ర‌మంలో  ప‌వ‌న్ క‌ల్యాణ్ ను.. మంత్రి కేటీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌రిచ‌యం చేయ‌బోయారు. అయితే.. త‌మ ఇద్ద‌రికి గ‌తంలోనే ప‌రిచ‌యం ఉంద‌ని.. ఒక‌రికొక‌రం బాగా తెలుస‌న్న మాట చెప్ప‌టం చూస్తే.. చాలా అప్డేట్స్ ను గ‌వ‌ర్న‌ర్ సాబ్ మిస్ అవుతున్నార‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది. ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిణామాలపై కేంద్రానికి నివేదిక‌లు పంపాల్సిన బాధ్య‌త ఉన్న స్థానంలో ఉండి కూడా ఇలాంటివి మిస్ అయితే ఎలా సారూ?
Tags:    

Similar News