మోడీ స్టైలే వేరు.. ఏదైనా విశేషం ఉంటేనే ఎవరినైనా కలుస్తాడు.. విశేషం లేకుండా నివేదికల పేరుతో విసిగించే వారిని కలవడానికి మోడీ అంతగా శ్రద్ధ చూపడు.. దేశంలో ఇంకా కాంగ్రెస్ పరిపాలన వాసనలు పోవడం లేదు. పాత అధికారులు దాదాపు 10 ఏళ్లు కాంగ్రెస్ హయాంలో పనిచేయడంతో కాంగ్రెస్ చూపిన బాటలోనే నడుస్తున్నారట.. అవి మోడీకి ఏమాత్రం ఇష్టం ఉండవు.. అందుకే గద్దెనెక్కగానే ప్లానింగ్ కమిషన్లు అన్నీ పీకిపారేసి ‘నీతి అయోగ్’కు రూపకల్పన చేశారు. పాలనలో మరెన్నో సంస్కరణలు చేశారు..
కాంగ్రెస్ హయాంలో కీలకంగా వ్యహరించిన అందరినీ మార్చేస్తున్న ప్రధాని మోడీ.. ఏపీ - తెలంగాణ ఉమ్మడి గవర్నర్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన పదవి కాలం ముగిసిపోతున్నా పొడగింపు చేస్తూ వస్తున్నారు. క్లిష్టమైన ఏపీ విభజన ఇక్కడి వ్యవహారాల గురించి మొత్తం తెలిసిన గవర్నర్ నరసింహన్ అయితేనే ఇక్కడ న్యాయం చేస్తాడని మోడీ గవర్నర్ ను మార్చడం లేదు. మోడీ నమ్మకాన్ని నిలబెడుతూ గవర్నర్ కూడా ప్రతి నెలా తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై నివేదికలు తయారు చేస్తూ ఢిల్లీ బాటపడుతున్నారు. కానీ ఇలాంటి నివేదికలు - గట్రా విషయాలు మోడీకి నచ్చవు. ఏదైనా పరిస్థితులు తీవ్రంగా ఉంటేనే ఆయన కలిసి చర్చిస్తారు. నెలవారీ మూస నివేదికలతో తనను కలవడాన్ని ఆయన ఇష్టపడరు..
తాజాగా గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశాలకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఐదు రోజుల పాటు ఉన్న గవర్నర్ ప్రధాని మోడీని కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు నిన్న రాత్రి కలిశారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిణామాలాపై నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పెద్దగా ఆసక్తి చూపని ప్రధాని వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై మాత్రమే గవర్నర్ ను ఆరాతీసినట్లు తెలిసింది.
ఇలా గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినట్లు పుస్తకాల కొద్దీ నివేదికలు తయారు చేసి మోడీ ప్రభుత్వానికి పంపుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కేవలం వర్ధమాన వ్యవహారాల్లో ఏదైనా కీలకంగా ఉంటే మాత్రమే మోడీ ఆసక్తి చూపిస్తాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి.