కేంద్రంలో కావొచ్చు.. రాష్ట్రంలో కావొచ్చు.. ప్రభుత్వం ఏది ఉన్నా సరే.. తన సీటుకు ఏమాత్రం షాక్ తగలకుండా ఉండే సత్తా గవర్నర్ నరసింహన్ సొంతంగా చెప్పాలి. అధికారంలో ఉన్న వారికి అండగా ఉన్నట్లు ఉండే ఆయన.. వారికి కొండంత దన్నుగా ఉంటారన్న పేరుంది. ఇలాంటి విలక్షణత ఉన్న మరే గవర్నర్ కూడా దేశంలో మరెవరూ లేరని చెప్పాలి.
ప్రభుత్వాధినేతల్ని తన తీరుతో ఇంప్రెస్ చేసే గవర్నర్ నరసింహన్.. తన చర్యలతో సామాన్యుల్నిసైతం అట్రాక్ట్ చేయటం ఆయనకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. వ్యాపారంగా మారిపోయిన విద్యా.. వైద్యంపై అప్పుడప్పుడు తన ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కటం.. తనకు సన్నిహితమైన ప్రభుత్వాల మీద విమర్శలు చేసేందుకు సైతం వెనకాడకపోవటం నరసింహన్ ప్రత్యేకత.
ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తే.. అదెంత రచ్చ అవుతుందో తెలిసిందే. కానీ.. నరసింహన్ మాత్రం వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపిస్తే.. దాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాజిటివ్ గానే తీసుకుంటారే తప్పించి.. వేలెత్తి చూపించారే అని అస్సలు ఫీల్ కావటం కనిపించదు. అలా అని.. తన హద్దుల్ని ఏ మాత్రం దాటని ఆయన అప్పుడప్పుడు తనదైన సర్ ప్రైజుల్ని ఇస్తుంటారు.
తాజాగా అలాంటి పనే చేసిన ఆయన.. హైదరాబాద్ మెట్రోరైల్ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. రాజ్ భవన్ నుంచి బేగంపేట మెట్రో స్టేషన్ కు వెళ్లిన గవర్నర్ దంపతులు సామాన్యుల మాదిరే మెట్రో రైల్ టికెట్ కొనుగోలు చేశారు. ట్రైన్ ఎక్కేందుకు స్టేషన్లోకి రావటంతో ఒక్కసారిగా మెట్రో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. వారికి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదు.
వారిని ట్రైన్ లోకి సాదరంగా తీసుకెళ్లటంతో పాటు.. తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బేగంపేటలో ట్రైన్ ఎక్కిన గవర్నర్ దంపతులు అమీర్ పేటలో దిగి.. ఫ్లాట్‌ఫాం మారి మియాపూర్ ట్రైన్ ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ట్రైన్ మియాపూర్ చేరే సమయానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అక్కడకు చేరుకొని.. వారితో ఉన్నారు. మెట్రో ప్రయాణం బాగుందన్న కితాబు ఇచ్చిన గవర్నర్ దంపతుల్ని.. మియాపూర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వసతుల్ని చూడాల్సిందిగా ఎండీ రెడ్డి కోరారు. ఫర్లేదన్నా.. ఒప్పుకోకపోవటం.. గవర్నర్ సతీమణి ఆసక్తి ప్రదర్శించటంతో మియాపూర్ స్టేషన్ బయట ఏర్పాటు చేసిన వివిధ రకాలైన కాన్సెప్ట్ లను వివరించారు. మొత్తానికి తమ మెట్రో ప్రయాణంపై గవర్నర్ దంపతులు హ్యాపీగా ఫీలైనట్లుగా అధికారులు చెబుతున్నారు. గవర్నర్ హ్యాపీ సంగతి ఎలా ఉన్నా.. మంచి హోదాలో ఉండి కూడా ఎలాంటి దర్పం ప్రదర్శించకుండా సామాన్యుల మాదిరి వ్యవహరించిన గవర్నర్ దంపతులు మాత్రం హైదరాబాదీయుల మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు.