కోడ్ ఉల్లంఘన ఏంది మేయర్ గారు?

Update: 2021-03-05 12:44 GMT
అమావాస్య రోజున ప్రమాణస్వీకారం చేయటానికి జీహెచ్ఎంసీకి ఎన్నికైన కార్పొరేటర్లు చాలా మంది ఇష్టపడలేదు. మరో మంచి రోజు చూడొచ్చు కదా అనుకున్నా.. రూల్ పొజిషన్.. దీనికి తోడు అధికారపక్షం నుంచి అందిన ఆదేశాలతో.. ఆ పార్టీ కార్పొరేటర్లు తలాడించి మరీ ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మేయర్ గా ఎంపికైన గద్వాల విజయలక్ష్మీ మాత్రం ఏదో ఒక ఇష్యూలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం మీద పార్టీలో పలువురు గుర్రుగా ఉన్నారు. అయినప్పటికి ఎవరి అభిప్రాయాల్ని పట్టించుకోకుండా.. తనకు తానుగా గద్వాలను మేయర్ గా ఫైనల్ చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆమె తన మాట తీరును జాగ్రత్తగా ఉంచుకోవాలని.. తొందరపడొద్దన్న విషయాన్ని చెప్పినట్లు చెబుతారు. సహజంగానే దూకుడుగా వ్యవహరిస్తూ.. తరచూ వివాదాల్లో కూరుకుపోయే గద్వాల విజయలక్ష్మీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

జీహెచ్ఎంసీ కార్యాలయంలో తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పే కరపత్రాల్ని పంచిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు మేయర్ పదవిలో ఉన్న ఆమె.. తన ఛాంబర్ లో పార్టీ తరఫున ప్రచారం చేయటం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు.

తాజాగా ఒక ఎన్టీవో సభ్యులు మర్యాదపూర్వకంగా మేయర్ ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ కరపత్రాల్ని వారికి అందించి.. పార్టీ అభ్యర్థి వాణీ దేవిని గెలిపించాలని కోరటం హాట్ టాపిక్ గా మారింది. ఈ తీరు.. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
Tags:    

Similar News