గగన వీధిలో విరోధులైనా..భూమ్మీద మాత్రం బెస్ట్ ఫ్రెండ్సే

Update: 2020-04-10 16:06 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తో విశ్వవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో విమానయానం అటకెక్కింది. ఆయా ఎయిర్ లైన్స్ సంస్థల విమానాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా విశ్రాంతి మోడ్ లోనే ఉండిపోయారు. గగన యానంలో ఎయిర్ లైన్స్ మధ్య ఏ రకమైన పోటీ వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రయాణీకులను ఆకర్షించే విషయంలో ఒక దానిని మించి మరొకటి ఆపర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోటీ తత్వం అంతా ఆకాశ వీధిలో ఉన్నప్పుడే... భూమ్మీద మాత్రం తాము మంచి మిత్రులం అంటూ ఎయిర్ లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. చెప్పడమే కాదండోయ్.. ఏకంగా తమ మధ్య ఉన్న ఆసక్తికర స్నేహ బంధాలను కూడా అవి బయటపెట్టుకున్నాయి. ఈ తరహాలోనే శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎయిర్ లైన్స్ సంస్థల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీనిని నెటిజన్లు పట్టేయగా... ఎయిర్ లైన్స్ మధ్య కొనసాగిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారింది.

మనందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సంభాషణను తొలుత ఇండిగో ప్రారంభించగా.. ఆ తర్వాత చర్చలోకి విస్తారా - గో ఎయిర్ - ఎయిర్ ఏసియా ఇండియా - స్పైస్ జెట్ ఎంట్రీ ఇవ్వగా.. చివరగా ఢిల్లీ ఎయిర్ పోర్టు కూడా ఎంట్రీ ఇచ్చి చర్చను రక్తి కట్టించాయి. ఈ సంస్థలన్నీ మిగిలిన సంస్థలకు ఉన్న ట్యాగ్ లైన్లను ప్రస్తావిస్తూ.. కరోనా వేళ ఆకాశయానాలకు స్వస్తి చెప్పి మంచి పని చేశామన్న రీతిలో ఒకదానిని మరొకటి మెచ్చుకున్నాయి. ఈ సంభాషణ సాంతం ఆసక్తికరంగా సాగగా - చివరగా ఢిల్లీ ఎయిర్ పోర్టు... విమానయాన సంస్థల మధ్య నెలకొన్న ఈ సుహృద్భావ వాతావరణం - కరోనా వైరస్ వేళ.. సదరు సంస్థలు పాటిస్తున్న సంయమనాన్ని కొనియాడింది. అంతేకాకుండ రేపటి భవిష్యత్తు కోసం ఎయిర్ లైన్స్ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను కట్టిపెట్టేసి విశ్రాంతి తీసుకుంటున్న వైనాన్ని కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టు తనదైన శైలి వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసింది.
   

Tags:    

Similar News