కోహ్లి విషయంలో దాదాకు పెరుగుతున్న మద్దతు

Update: 2021-12-17 23:30 GMT
సరిగ్గా నెలన్నర కూడా కాలేదు.. టీమిండియాలో అనేక పరిణామాలు.. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటన చేయడం..
టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ చేతిలో అనూహ్య పరాజయం.. కివీస్ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా నియమితుడవడం.. కోహ్లి విశ్రాంతి తీసుకోవడం, టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ ఆడకపోవడం.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కోహ్లిని కెప్టెన్ గా తప్పించడం.. అతడు వన్డే సిరీస్ కు విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు రావడం.. రోహిత్ శర్మ టెస్టులకు దూరమవడం .. వన్డే కెప్టెన్సీ తొలగింపు పై కోహ్లి-బీసీసీఐ మధ్య వివాదం.. సెలక్టర్లను కోహ్లి తప్పుబట్టడం.. ఇలా ఎన్నో పరిణామాలు. అన్నీ ఇప్పుడు సర్దుకున్నాయి. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ లో కోహ్లికి అభిమానుల నుంచి ఎక్కువగా మద్దతు లభించింది.

సహజంగానే టాప్ బ్యాట్స్ మన్ కావడంతో కోహ్లికి దన్నుగా నిలిచారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వారికి విలన్ గా కనిపించాడు. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని స్వయంగా కోరానని గంగూలీ కామెంట్ చేయడం, అలాంటిదేమీ లేదని కోహ్లి చెప్పడం రాద్ధాంతాన్ని రేపినట్టైంది. కోహ్లీని కావాలని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అతడి అభిమానులు ఇప్పటికీ అనుమానంతో ఉన్నారు. గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షాను తప్పించాలని డిమాండ్ చేశారు.

ఎంతైనా గంగూలీ కదా?

గంగూలీ ఒకప్పుడు టీమిండియా సారథిగా ఎలా ఉండేవాడో అందరికీ తెలిసిందే. సచిన్ , ద్రవిడ్ వంటి దిగ్గజాలున్న కాలంలో.. ఎవరూ ఊహించనంతగా గంగూలీ కి విపరీతమైన అభిమానులు ఉండేవారు. దీనికి కారణం గంగూలీ సొంత వ్యక్తిత్వంతో పాటు జట్టు కోసం చేసిన ఆలోచనలు ప్రయత్నాలు. కొత్త జట్టు రూపకల్పనకు గంగూలీ ఎంతో శ్రమించేవాడు. ఇలాంటి ప్రయత్నాల్లోనే సెహ్వాగ్, యువరాజ్, హర్బజన్ వంటి ఆటగాళ్లు దొరికారు.

అందుకే గంగూలీని అభిమానులు నాడు ఆరాధించేవారు. ఆఖరుకు గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించినా ఊరుకోలేదు. ఇక తాజా విషయానికొస్తే.. కోహ్లి వివాదంలో గంగూలీకి కూడా మద్దతు పెరుగుతోంది. టీమిండియా కోసం ఎన్నో చేసిన గంగూలీకి, భారత జట్టు బాగు కోసం ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని చెబుతూ #NationStandswithDada హ్యా‌ష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 2000 సంవత్సరం నాటి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం నుంచి భారత జట్టును సమర్థంగా బయటపడేసి సక్రమ మార్గంలో నడిపించిన ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు.

రెండేళ్లల్లో కేవలం 24.64 సగటుతో పరుగులు చేస్తున్న కోహ్లీపై కెప్టెన్సీ భారం పడుతున్న విషయాన్ని ఆయన అభిమానులు గుర్తించలేకపోయారని, గంగూలీ ఆ విషయాన్ని గ్రహించే కెప్టెన్సీ నుంచి తప్పించాడని అంటున్నారు. ఇక కుమార సంగర్కర, షోయబ్ అక్తర్, స్టీవ్ వా, వకార్ యూనిస్ వంటి విదేశీ క్రికెటర్లు కూడా గంగూలీ కెప్టెన్సీని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. దీనంతటిలో తెలిసిందేమంటే.. కోహ్లి పై అభిమానం ఉన్నంతనే సరిపోదు.. గంగూలీని తప్పుబట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని..



Tags:    

Similar News