గ్రౌండ్ రిపోర్ట్: గురజాలలో గెలుపెవరిది?

Update: 2019-03-28 08:11 GMT
అసెంబ్లీ నియోజకవర్గం : గురజాల
టీడీపీ: యరపతినేని శ్రీనివాస్ (సిట్టింగ్ ఎమ్మెల్యే)
వైసీపీ : కాసు మహేష్ రెడ్డి
జనసేన : చింతలపూడి శ్రీనివాస్

గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి టఫ్ ఫైట్ నెలకొంది. ఇక్కడ సీనియర్ నేతకు, జూనియర్ సంచలనానికి మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ సిట్టింగ్ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరుఫున నిలబడ్డారు. ఆయనకు పోటీగా వైసీపీ నుంచి మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు యువ కాసు మహేష్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఈ రెండు కుటుంబాలకు కూడా ఘనమైన చరిత్ర ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మరి ఈ సీనియర్, జూనియర్ పోరులో గెలుపెవరిది అన్న ఉత్కంఠ జిల్లాలో నెలకొంది.

*గురజాల చరిత్ర :
గురజాల  నియోజకవర్గంలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాలు ఉన్నాయి. 2.53లక్షల మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎస్సీలు, ముస్లింలు, కాపులు, వైశ్యులు, రెడ్లు, ఎస్టీలు, ఇతర సామాజికవర్గ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తొలి ఎమ్మెల్యేగా మండవ బాపయ్య చౌదరి ఎన్నికయ్యారు. 2009, 2014  ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాస్  వరుసగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాడ్డాక కొత్తలో 1964-71 మధ్య కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా సేవలందిచారు. ఆ తర్వాత ఆయన కొడుకు కాసు కృష్ణారెడ్డి రాజకీయాల్లో కొనసాగారు. ఇప్పుడు ఆయన మనవడు కాసు మహేష్ వైసీపీ నుంచి మూడోతరం రాజకీయాల్లోకి ఈసారి అడుగుపెట్టారు.  

*యరపతనేని హైట్రిక్ కొడుతాడా?
గురజాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ కొట్టడానికి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్ రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాస్ అప్పటి వైసీపీ అభ్యర్థి కృష్ణమూర్తిపై దాదాపు 7800 ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. గెలిచిన తర్వాత హామీల్లో చాలా వరకు నెరవేర్చారు. దాదాపు 1200 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. ఇదే సమయంలో ఆయనపై మైనింగ్ విషయంలో అక్రమాలు ఆరోపణలు బయటపడడం పెద్ద మైనస్ గా మారింది. యరపతినేనికి అధికార టీడీపీ బలం.. అనుభవం.. అనుచరులు పెద్ద ప్లస్ గా ఉన్నాయి.

*కాసు వారసత్వంతో మహేష్ రెడ్డి గెలిచేనా?
యరపతినేనిని ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా మాజీ సీఎం మనవడు మహేష్ రెడ్డిని గురిజాలలో దించారు. వైఎస్ జగన్ అండదండలతో తాత,తండ్రి రాజకీయ వారసత్వంతో మహేష్ దూకుడుగా ముందుకెళుతున్నారు. తండ్రి కృష్ణా రెడ్డి మంత్రిగా చేసిన అనుభవంతో ఆయనకు ప్రజలతో సంబంధాలున్నాయి. ఇది మహేష్ రెడ్డికి కలిసివస్తుంది. అయితే గురిజాలలో కాసు బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి ఇద్దరూ ఓడిపోవడం మహేష్ రెడ్డికి మైనస్ గా మారింది. ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాలని మహేష్ దూకుడుగా ముందుకెళ్తున్నారు.

*జనసేన కాపు ఓట్లపైనే
జనసేన తరుఫున చింతలపూడి శ్రీనివాస్ ను పవన్ బరిలోకి దించారు. ప్రధానంగా ఈయన బీసీ, కాపు ఓట్లపైనే నమ్ముకొని పోరాడుతున్నారు. కానీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీపైనే ఉంది.

*కాసు మహేష్ ఓడిస్తాడా?
గురిజాలలో విజయం కోసం వైఎస్ జగన్ బలంగా నమ్మి మహేష్ రెడ్డిని రంగంలోకి దింపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. అవినీతి ఆరోపణలు కాసును గెలిపిస్తాయని అంటున్నారు. అయితే యరపతినేనిని ఓడించడం అంత ఈజీ కాదన్న విషయం నిజం.. పాత సెంటిమెంట్లకు తాను చరమగీతం పాడుతానని కాసు మహేష్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. గురిజాలలో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. గెలుపు కోసం పట్టు విడవకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చూడాలి మరి ఇక్కడ సీనియర్ ను జూనియర్ మహేష్ రెడ్డి ఓడిస్తాడా లేదా.?
    
    
    

Tags:    

Similar News