ట్వీట్ తో ఆమె గుండె బద్ధలైందట..మరి ఆమె మాటలో?

Update: 2017-02-28 17:20 GMT
కాసేపు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. దాని వల్ల వచ్చే సుఖం ఏమిటంటే.. మర్యాదపు పరదాల్నిపక్కన పెట్టేయొచ్చు. మనసులో ఉన్నదంతా చెప్పేసుకోవచ్చు. కొన్ని విషయాల మీద ఓపెన్ గా మాట్లాడేందుకు సంప్రదాయవాదులు అంత సుముఖంగా ఉండరు. అదే సమయంలో మరికొందరు మాత్రం సెంటిమెంట్ రేపే నాలుగు పడిగట్టు పదాల్ని పట్టుకొని సంచలనాలు సృష్టిస్తుంటారు. తమ వాదనకు వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా.. వారి మీద భయంకరమైన ముద్రలు వేసేస్తుంటారు.

ప్రపంచంలో మరో దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందో ఉండదో కానీ.. కొన్ని చిత్రమైన లక్షణాలు భారత్ లో మాత్రమే కనిపిస్తాయి. రాజ్యాంగం ఇచ్చిన భావస్వేచ్ఛకు.. తమ అతి తెలివితేటల్ని జత చేసి వినిపించే కొందరి వాదనల కారణంగా దేశంలోని లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పాలి. ఇరు వర్గాల వాదనల్ని వినిపించాలన్న ఉద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు మర్యాదను ప్రదర్శిస్తూ.. వారేం చెబుతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తే.. మరికొన్ని మీడియాలో తమ రాజకీయ చొక్కాల్ని కనిపించకుండా వివాదాల్ని మరింత సంచలనాల కోసం వాడుకునే వైఖరి కనిపిస్తుంది.

ఇంతకూ ఈ మాటలన్ని ఎవరి గురించి అంటే..కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె కమ్ ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ గురించే. తన తండ్రి మరణానికి పాకిస్థాన్ కారణం కాదని.. యుద్ధమంటూ సాధారణ జీవులకు అర్థం కాని గొప్ప మాటల్ని చెప్పేశారు. ఆమె మాటలు ఎలా ఉంటాయంటే.. లాగి పెట్టి ఎవరైనా కొట్టారంటే.. అది కొట్టినోడి తప్పుకంటే.. వాడి చేతిదే అనేటట్లుగా ఆమె మాటలుఉంటాయి.

తండ్రి మరణానికి కారణం పాకిస్థాన్ దుర్మార్గమన్న మాట ఆమె నోటి నుంచి రాదు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ మాటలు నా గుండెల్ని బద్ధలు చేస్తున్నాయని ఆవేశపడిపోతుంటారు. మరి.. ఆమె మాటలు జనాల్ని ఎంతగా హర్ట్ చేస్తున్నాయన్నది ఆమె ఎందుకు గుర్తించరు? తండ్రి మరణం మీద విచిత్ర వాదనలు వినిపించి.. మీడియా దృష్టిని ఆకర్షించిన ఆమె.. ఈ మధ్యనే రాంజాస్ కాలేజీ వ్యవహారంలో మరోసారి తెర మీదకు వచ్చారు.

ఈ కాలేజీ వివాదం ఏమిటన్నది మూడు ముక్కల్లో చెప్పాలంటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న వ్యక్తిని రాంజాస్ కాలేజీలో జరిగే సెమినార్ కు సాదరంగా ఆహ్వానించటం. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని పిలవటం ఏమిటంటూ ఎబీవీపీ సంఘానికి చెందిన విద్యార్థులు అడ్డుకోవటం.. భావస్వేచ్ఛను అడ్డుకుంటారా? అంటూ వారిపై తెగబడిన వామపక్ష భావజాలం విద్యార్థుల మధ్య గొడవ.. కొట్టుకోవటం జరిగింది. ఈ సందర్భంగా తన తండ్రి మృతి గురించి ఎలా అయితే విచిత్రమైన వాదన తీసుకొచ్చి ప్లకార్డు పట్టుకున్నదో.. ఈసారి అలానే.. తాను ఎబీవీపీకి భయపటం లేదని.. తన వెంట దేశంలోని విద్యార్థులంతా ఉన్నట్లు చెప్పుకున్నారు.

ఆమె వాదనలో అభ్యంతరం ఏమిటంటే.. ఆమె ఎబీవీపీకి భయపటంలేదన్నది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. దాంతో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు. కానీ.. ఆమె వెనుక దేశంలోని విద్యార్థులంతా ఉన్నారంటూ క్లెయిం చేసుకోవటంలోనే అసలు సమస్య. ఆమె షురూ చేసిన ప్లకార్డు ఉద్యమం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో మీడియాలోనూ దీని మీద భారీగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఆమె పోకడల్ని సమర్థించని కొందరు అతివాదులు.. ఆమెను రేప్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో.. దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తిని సెమినార్ కు పిలవాల్సిన అవసరం ఏమిటనే సూటిప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. కానీ.. ఆ విషయాన్ని ఆమె ఏ ప్లకార్డు పట్టుకొని రియాక్ట్ కారు.

ఇదిలా ఉంటే.. కౌర్ తాజా ఎపిసోడ్ ను టచ్ చేయని మాజీ క్రికెటర్ సెహ్వాగ్.. తన తండ్రి మరణం విషయంలో కౌర్ గతంలో చేసిన ప్లకార్డు ప్రచారానికి కౌంటర్ గా ట్వీట్ చేశారు. ఆమె మాదిరే ప్లకార్డు పట్టుకొని.. రెండు సార్లు చేసిన ట్రిపుల్ సెంచురీలు తన బ్యాట్ చేసిందంటూ ట్వీట్ చేశారు. దీనిపై తాజాగా స్పందించిన ఆమె.. సెహ్వాగ్ ట్వీట్ తో తన గుండె బద్ధలైందని వాపోయారు. సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ తోనే ఆమె గుండె బద్ధలైతే.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆమె తండ్రి మరణాన్ని.. ఆమెకు ఆమె తక్కువ చేసిన.. శత్రువును వెనకేసుకు వచ్చిన వైనానికి దేశంలోని ఎంతమంది గుండెలు బద్ధలైపోయాయి.

తన తండ్రి మరణం కౌర్ కు ఎక్కువో.. తక్కువో మనకు తెలీదు. కానీ.. ఆమె మాటలు.. మిగిలిన అమరవీరులకు కూడా వర్తించే ప్రమాదాన్ని మర్చిపోకూడదు. ఆమె తన భావజాలాన్ని.. మరే అమరవీరుడి భార్యతోనో.. పిల్లలతోనో పంచుకున్నారా? అలా చేస్తే.. వారి రియాక్షన్ ఎలా ఉందన్నది చెబితే బాగుంటుంది. ప్లకార్డుల మీద.. దేశం మొత్తం నా వెనుక ఉందనుకుంటే సరిపోదు. సర్లే.. చిన్నపిల్ల తెలిసీ తెలియక మాట్లాడుతుందని ఊరుకుంటే.. అంతకంతకూ మాటలు చెబుతున్న ఆమె వైనం సెహ్వాగ్ లాంటి వారికి చిరాకు పుట్టి ఉండొచ్చు. అందుకే కాబోలు ఆమె మెచ్యూరిటీ లేని మాటల్ని తన వ్యంగ్యాస్త్రంతో బదులిచ్చే ప్రయత్నం చేశారు. దానికి రియాక్ట్ అయిన ఆమె.. తన గుండె బద్ధలైపోయిందన్నపెద్ద మాటను చెప్పేశారు. చిన్న వ్యంగ్యానికే ఆమెగుండె బద్ధలైతే.. పాక్ దుర్మార్గానికి బలైన వేలాది కుటుంబాల సెంటిమెంట్లను దెబ్బ తీసేలా మాట్లాడిన కౌర్ మాటల కారణంగా కోట్లాది మంది ఎంతగా హర్ట్ అయ్యారో ఆమెకు ఎవరు చెబుతారు? అసలు ఆమె అలాంటి మాటల్ని అర్థం చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారా? అన్నది అసలుసిసలు ప్రశ్న. అందుకే.. కౌర్ లాంటి వారు తమ మాటలతో సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తే.. నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. దేశం మొత్తం తన వెనుకే ఉందన్న భ్రమలో ఆమె చాలానే మాటలు చెప్పేయగలరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News