గుత్తా సెటైర్‌!...బాబు క‌ల‌లోకి వ‌స్తున్న‌ది వీరే!

Update: 2019-02-08 11:50 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై ఇప్పుడు సెటైర్ల మీద సెటైర్లు వ‌చ్చి ప‌డుతున్నాయి. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతానంటూ రంగంలోకి దిగిన చంద్ర‌బాబు బొక్క బోర్లా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటు ఏపీలో ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమ‌లులో త‌న‌దైన రెండు నాల్క‌ల ధోర‌ణితో ముందుకు సాగుతున్న చంద్ర‌బాబు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా గెలవాలో తెలియ‌క‌... ఇత‌ర పార్టీల నేత‌లు ఇచ్చిన హామీల‌ను కాపీ కొట్టేసి మొత్తంగా కాపీ మాస్ట‌ర్‌గా మారిపోయారు. ఈ త‌ర‌హా చంద్రబాబు వైఖ‌రిపై ఏపీలో విప‌క్ష వైసీపీ - బీజేపీ - జ‌న‌సేన‌లు త‌మ‌దైన రీతిలో విరుచుకుప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుపై ఇటు ఏపీ నుంచే కాకుండ అటు తెలంగాణ నుంచి విమ‌ర్శ‌లు - సెటైర్లు వ‌ర‌ద‌లై పారుతున్నాయి.

ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ - తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబుపై భారీ సెటైర్లు వేశారు. ఎన్నిక‌లంటేనే వ‌ణికిపోతున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు క‌ల‌లో కూడా కొంద‌రు నేత‌లు గుర్తుకు వ‌స్తున్నార‌ని - వెర‌సి ప‌గ‌లు త‌న ప్రసంగాల్లో ఆయా నేత‌ల‌పై దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేస్తున్న చంద్ర‌బాబు... రాత్రి కూడా ఆ నేత‌ల నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నార‌ని గుత్తా సైటైరిక‌ల్‌ గా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా బాబుకు క‌ల‌లో కూడా గుర్తుకు వస్తున్న నేత‌లెవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... ఇంకెవ‌రు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీలేన‌ట‌. ప‌గ‌లు ఎక్క‌డికెళ్లినా... సంద‌ర్భం ఏదైనా, స‌మ‌యం ఏదైనా ఈ ముగ్గురిపై త‌న‌దైన శైలిలో ఈర్ష్యాసూయ‌ల‌తో విరుచుకుప‌డిపోతున్న చంద్ర‌బాబు... రాత్రి వేళల్లో నిద్ర‌లోనూ వీరి పేర్ల‌నే క‌ల‌వ‌రిస్తున్నార‌ని గుత్తా వ్యాఖ్యానించారు.

ఇంకా చంద్ర‌బాబు గురించి గుత్తా ఏమ‌న్నారంటే...  అసహనం, ఈర్షతో చంద్రబాబు తెలంగాణపై విరుచుకుపడుతున్నారని ఆయ‌న దుయ్యబట్టారు. చంద్ర‌బాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ వీళ్లందరూ చంద్రబాబుకు కలలోకి వస్తున్నారనీ, వాళ్ల పేర్లు వింటేనే ఆయన ఉలిక్కిపడుతున్నారని గుత్తాఎద్దేవా చేశారు. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వాళ్లు లేరని విమర్శించారు. చంద్రబాబు పాలన తొందరలోనే అంతమవుతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. మోసం, కుట్రలు అన్నవి చంద్రబాబుకు మారుపేరు లాంటివని చెప్పిన గుత్తా... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ ను కలిశామనీ, అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు కూడా ఉంటే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని కూడా గుత్తా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా గుత్తా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబును క‌డిగిపారేశార‌ని చెప్పాలి.


Tags:    

Similar News