ఎంపీ ప‌ద‌వికి రాజీనామా వ‌ర‌కే నా ప‌ని...

Update: 2017-09-23 04:06 GMT
న‌ల్ల‌గొండ ఉప ఎన్నిక రాజ‌కీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచి టీఆర్ ఎస్‌ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజీనామా చేయించనున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కేసీఆర్ గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేశార‌ని తెలుస్తోంది. ద‌స‌రా త‌ర్వాత ఉప ఎన్నికపై క్లారిటీ వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి అభిప్రాయం ఏమిట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ రోజు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా వార్తలను సమర్థించను, వ్యతిరేకించనని వ్యాఖ్యానించారు. తన రాజీనామా విషయంలో సీఎం కేసీఆర్‌ దే తుది నిర్ణయమని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తాను రాజీనామా చేస్తే ఎవరు పోటీ చేస్తారనేది సీఎం నిర్ణయిస్తారన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ కమిటీపై సీఎం మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నారన్నారు. స్థూలంగా తన ప‌ద‌వి వీడ‌టం అనేది త‌న చేతిలో లేద‌ని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప‌రోక్షంగా చెప్పేశారు.

మ‌రోవైపు తాజా సర్వేల ప్రకారం నల్లగొండ పార్లమెంట్ ప్రజలు టీఆర్ ఎస్ వైపే మొగ్గు చూపుతుండగా, ఈ శాతాన్ని మరింతగా పెంచుకునేందుకు నల్లగొండ ప్రజల కోర్కెలు తీర్చేందుకు అభివృద్ధి జాతరకు సీఎం శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండలో సీఎం పర్యటన సందర్భంగా రూ.500కోట్ల పనులకు శంఖుస్థాపనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఐటీ పార్క్, 10వేల డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు శిల్పారామం, కళాభారతి వంటి పనులను మంజూరు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. నల్లగొండ ప్రజల ప్రధాన డిమాండ్లు తీర్చడంతో పాటు ఏ వర్గంలో మద్దతు ఉంది, ఏ వర్గంలో అసంతృప్తి ఉంది వంటి వివరాలను సామాజిక వర్గాలు వృత్తుల ఆధారంగా సేకరిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
Tags:    

Similar News