జేసీ ర‌చ్చ త‌ప్పేం కాదంటున్న టీ.ఎంపీ

Update: 2017-06-17 16:27 GMT
బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వలేదన్న కోపంతో దౌర్జన్యానికి దిగి విశాఖ ఎయిర్‌ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. జేసీ తీరుపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. అయితే ఈ ఎపిసోడ్‌ లో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ జేసీ తీరును త‌ప్పుప‌ట్ట‌గా విపక్షం, అందునా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌కు చెందిన ఎంపీ మ‌ద్ద‌తిచ్చారు. ఆయ‌నే కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచి టీఆర్ ఎస్‌ లో చేరిన న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి! ఇండిగో విష‌యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని గుత్తా సమర్థించారు. ఎంపీల విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఇండిగోపై చాలా మంది ఎంపీలు ఫిర్యాదు చేశారని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఒక్కోసారి నిమిషం ఆలస్యమైనా ఇండిగో సిబ్బంది పట్టించుకోవడంలేదంటూ ఆయన మండిపడ్డారు. అయిన‌ప్ప‌టికీ ఎయిర్‌ లైన్స్‌ కు కేంద్ర ప్ర‌భుత్వం వత్తాసు ప‌లకడం మంచిది కాదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఉద్యోగుల పక్షాన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడడం దురదృష్టకరమని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఎంపీ హరిబాబు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. విమానం ఎక్కడానికి 45 నిమిషాల ముందు విమానాశ్ర‌యంలో ఉండాల‌న్న నిబంధన టికెట్‌ లో ఉంటుందని హరిబాబు తెలిపారు. ఒక వేళ టికెట్ ప్రయాణికుడు నిబంధనలు ఉల్లంఘిస్తే టికెట్‌ను నిరాకరించే హక్కు ఆయా విమానయాన సంస్థలకు ఉంటుందని వెల్లడించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేదం విధించడం ఆయా సంస్థ‌లు త‌గు నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని అన్నారు. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు పార్లమెంట్‌లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని… గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్‌ నిషేదం సమయంలో స్పీకర్‌ పరిష్కారం చూపారని హరిబాబు గుర్తుచేశారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News