జ‌స్ట్‌ 6 సెక‌న్ల‌లో మీ అకౌంట్ హ్యాక్‌!

Update: 2016-12-03 04:51 GMT
హ్యాకింగ్ వికృత రూపానికి ఇదో నిద‌ర్శ‌నం. కేవ‌లం ఆరు సెక‌న్ల‌లోనే అకౌంట్ హ్యాక్ చేసే ప‌రిజ్ఞానాన్ని హ్యాక‌ర్లు సాధించార‌ని తాజాగా వెలువ‌డిన రిపోర్టు తేల్చింది. నోట్లరద్దు తర్వాత భారత్‌ లో ఆన్‌ లైన్ లావాదేవీలు - డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఆన్‌ లైన్ పేమెంట్స్‌ లో ముందు వరుసలో ఉన్నాయి. ఇదే సమయంలో క్రెడిట్ - డెబిట్ కార్డుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే బ్రిటన్‌ లోని న్యూ కాస్టెల్ యూనివర్సిటీ పరిశోధక బృదం ఓ సంచలన ప్రకటన చేసింది. హ్యాకర్లు మీ క్రెడిట్ - డెబిట్ కార్డుల పూర్తి వివరాలు కేవలం ఆరుసెకండ్లలో పసిగట్టవచ్చని ప్రకటించింది. బ్రిటన్‌ కు చెందిన టెస్కో బ్యాంక్ ఇటీవల సైబర్ దాడికి గురైంది. దాదాపు 9000 మంది ఖాతాదారులకు చెందిన కార్డుల నుంచి దాదాపు రూ.22 కోట్లు చోరీకి గురయ్యాయి. ఈ ఆరుసెక‌న్ల హ్యాకింగ్ విధానంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు!

ప్ర‌స్తుతం ఆన్ లైన్ లావాదేవీల కోసం వీసా - మాస్టర్ కార్డ్ - రూపే - అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ వంటి ప్లాట్‌ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. న్యూ కాస్టెల్ శాస్త్రవేత్తల బృందం వీసా పేమెంట్ సిస్టంపై పరిశోధనలు చేపట్టింది. వివిధ వెబ్‌ సైట్లలో ఉన్న లొసుగులు - వీసా వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాల ఆధారంగా హ్యాకర్లు కేవలం ఆరు సెకండ్లలో డెబిట్ కార్డ్ నంబర్ - వాలిడిటీ - సీవీవీ నంబర్ - సెక్యూరిటీ కోడ్ వంటి వివరాలను సంపాదించే అవకాశం ఉందని తేల్చారు. తమ పరిశోధనా పత్రాలను యూనివర్సిటీ అకడమిక్ జర్నల్ ఐఈఈఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ప్రచురించారు. ఈ క్ర‌మంలో పరిశోధకులు రెండు ప్రధాన లోపాలు గుర్తించారు. మొదటిది.. కార్డు వివరాలను పలు వెబ్‌ సైట్ల నుంచి ఒకేసారి తప్పుగా నమోదు చేసినా గుర్తించడం లేదు. దీంతో హ్యాకర్లకు ఎక్కువ సార్లు ప్రయత్నించడానికి అవకాశం కలుగుతున్నది. రెండోది.. కొన్ని వెబ్‌ సైట్లు లావాదేవీల కోసం కార్డు నెంబర్ - వాలిడిటీ - సీవీవీ మాత్రమే అడుగుతుండగా - మరికొన్ని ఇతర వివరాలు అడుతున్నాయి. నేరగాళ్లు వాటిని క్రోడీకరించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. మాస్టర్ కార్డ్ ప్లాట్‌ ఫాం ఒకేసారి అనేక సైట్ల నుంచి నుంచి కార్డు వివరాలు నమోదు చేస్తే గుర్తిస్తున్నదని , ఈ కార్డులు హ్యాక్ చేయడం కష్టమని చెప్పారు. 3డీ సెక్యూర్ టెక్నాలజీ హ్యాకింగ్ నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. వెరిఫైడ్ బై వీసా - మాస్టర్‌ కార్డ్ సెక్యూరిటీ కోడ్ - అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ సేఫ్‌ కీ వంటికి గెస్సింగ్ అండ్ హిట్ నుంచి కాపాడుతాయని చెప్పారు.

ఆన్‌ లైన్ పేమెంట్స్‌ కు సంబంధించి ఒక కార్డు వివరాలను ఒకేసారి వివిధ సైట్ల ద్వారా ఉపయోగించినప్పుడు బ్యాంకులు గానీ, వీసా ప్లాట్‌ ఫాం గానీ గుర్తించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్లు రూపొందించుకుంటున్నారు. ఇవి కార్డుకు సంబంధించి కొన్ని అంకెలను ఊహించి అనేక ఫార్మాట్లలో అందిస్తాయి. వీటిని పలు వెబ్‌ సైట్లలో ఒకేసారి ఎంటర్ చేస్తారు. ఆయా సైట్లలో సరియైన వివరాలు నమోదు చేసిన చోట గ్రీన్‌ మార్క్ - తప్పుగా నమోదు చేసిన చోట రెడ్ మార్క్ వస్తుంది. పలు సైట్లలో వచ్చిన గ్రీన్ మార్స్ ఆధారంగా కార్డు వివరాలను సంపాదిస్తారు. దీనికి కేవలం రెండు సెకండ్ల సమయం పడుతుందని చెప్తున్నారు. సెక్యూరిటీ కోడ్‌ కు సంబంధించి వివిధ నెంబర్లను ఒకేసారి పలు సైట్లలో ఎంటర్ చేస్తారు. ఇలా ఒకటి రెండు ప్రయత్నాల్లో సరైన సెక్యూరిటీ కోడ్‌ ను గుర్తిస్తారు. ఈ ప్రక్రియకు కేవలం ఆరుసెకండ్లు పడుతుందని పరిశోధకులు తేల్చారు. దీన్ని గెస్సింగ్ అండ్ హిట్ విధానంగా పిలుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News