హ‌రికృష్ణ ఎంట్రీతో టీడీపీలో హీట్ పెరిగిందిగా!

Update: 2017-02-26 08:44 GMT
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీకి చుక్క‌లు చూపేలానే ఉన్నాయి. ఉపాధ్యాయ‌ - ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లను ప‌క్క‌న‌బెడితే... స్థానిక సంస్థ‌లు - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో అధికార టీడీపీకి సుదీర్ఘ క‌స‌రత్తు కొన‌సాగుతోంది.  ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా భేటీ అయిన పార్టీ అధిష్ఠానం... ఇప్ప‌టికీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఓ కొలిక్కి రాలేదు. నేటి ఉద‌యం విజ‌యవాడ‌లో పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైన పొలిట్ బ్యూరో స‌మావేశం కూడా గంట‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీ అభ్య‌ర్థుల ఖరారే ప్ర‌ధాన అజెండాగా ప్రారంభమైన ఈ భేటీ నేటి సాయంత్రానికి గానీ  ముగిసేలా లేదు. అంతేకాకుండా ఈ భేటీలో అభ్య‌ర్థుల ఖ‌రారు కూడా సాధ్యం కాద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చి చేరిన నేత‌లు - గ‌తంలో పార్టీలోనూ - ప్ర‌భుత్వంలోనూ కీల‌క భూమిక పోషించిన ప‌లువురు సీనియ‌ర్లు ఎమ్మెల్సీ సీట్ల‌ను కోరుతున్నారు. దీంతో ఆశావ‌హుల జాబితా చాంతాడంత పెరిగిపోయింది. ప్ర‌తి  జిల్లా నుంచి క‌నీసం న‌లుగురు అభ్య‌ర్థులు సీట్లు ఆశిస్తున్నారు. ఒక‌టి, అరా ల‌భించే సీట్ల కోసం ఇంత  పెద్ద మొత్తంలో ఆశావ‌హులు ఉంటే ఏం చేయాల‌ని బాబు త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. అంతేకాకుండా త‌న కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ను ఈ ద‌ఫా త‌ప్ప‌నిస‌రిగా  మండ‌లికి పంపాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలో ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అయిన నారా లోకేశ్ కు సీటిస్తే... త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని సీటు ద‌క్క‌ని నేత‌లు ప్ర‌శ్నించే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు.

ఇదంతా ఒక ఎత్తైతే... చాలా కాలం పాటు పార్టీ స‌మావేశాల‌కు - కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న చంద్ర‌బాబు బావ‌ - పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడు నంద‌మూరి  హ‌రికృష్ణ నేటి ఉద‌యం ప్రారంభ‌మైన స‌మావేశానికి వ‌చ్చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడి హోదాలో ఆయ‌న ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. గ‌తంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న హ‌రికృష్ణ ఇటీవ‌లే ఆ ప‌దవీ కాలం ముగియ‌డంతో ప్ర‌స్తుతం  ఖాళీగా ఉన్నారు. గ‌డచిన ఎన్నిక‌ల్లో ఎంపీ సీటో - లేదంటే కృష్ణా జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ సీటో ఇస్తే బాగుంటుంద‌ని ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అయితే నాడు హ‌రికృష్ణ విన్న‌పాన్ని చంద్రబాబు బుట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హ‌రికృష్ణ పార్టీ స‌భ‌ల‌పై బ‌హిరంగంనే అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన సంద‌ర్భాలు మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వంద‌కు పైగా మంది ఆశావ‌హుల జాబితాను ముందేసుకుని వారిలో ఓ 15 మందిని ఎంపిక చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్న చంద్ర‌బాబు... హ‌రికృష్ణ ఎంట్రీతో షాక్ తిన్నార‌ట‌.

అస‌లు ఈ స‌మావేశానికి హ‌రికృష్ణ వ‌స్తార‌న్న విష‌యంపై ఎలాంటి స‌మాచారం లేద‌ట‌. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో పార్టీ అధిష్ఠానంపై అంతెత్తున ఎగిరిప‌డ్డ హ‌రికృష్ణ స‌మావేశానికి వ‌స్తార‌ని దాదాపుగా ఎవరూ ఊహించ‌లేదు. అయితే పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్న హ‌రికృష్ణ‌కు ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానం వెళ్లింది. దీనినే ఆస‌రా చేసుకుని హ‌రికృష్ణ ఈ స‌మావేశానికి హాజ‌రై బాబు అండ్ కోకు షాకిచ్చిన‌ట్లు స‌మాచారం. అయినా పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడి హోదాలో  ఈ భేటీకి ఆహ్వానం లేకున్నా హ‌రికృష్ణ వ‌స్తే... అడ్డుకునే ద‌మ్ము చంద్ర‌బాబుకు కూడా లేద‌న్న విష‌యం తెలిసిందే. మ‌రి హ‌రికృష్ణ ఏం ఆశించి ఈ భేటీకి హాజ‌ర‌య్యార‌న్న అంశంపై స‌ర్వ‌త్ర ఆస‌క్తి నెల‌కొంది. త‌న‌కు షాకిచ్చేలా సడెన్ స‌ర్‌ప్రైజ్ ఇస్తూ భేటీకి వ‌చ్చిన బావ హ‌రికృష్ణ‌ను బాబు ఎలా స‌ముదాయిస్తారో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News