ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు...బాబుపై హ‌రీష్ ఫైర్‌

Update: 2015-11-18 12:41 GMT
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ నేత‌లు ఎప్పుడూ చంద్ర‌బాబును విమ‌ర్శించ‌ని రోజు లేదు. మంత్రులు, ఇత‌ర నాయ‌కులు రోజూ క‌రెంటు క‌ష్టాల నుంచి నీటి వివాదాల వ‌ర‌కూ ఏ స‌మ‌స్య వ‌చ్చినా అందుకు చంద్ర‌బాబు అడ్డుకుంటున్నార‌నే విమ‌ర్శించేవారు. ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఆర్డినెన్స్ ద్వారా క‌లుపుకోవ‌డం నుంచి తెరాస నాయ‌కులు చంద్ర‌బాబుపై ప్ర‌తి రోజు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.

రాష్ర్ట విభ‌జ‌న‌కు ముందు త‌ర్వాత చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని విమ‌ర్శించే వారిలో మంత్రి హ‌రీష్‌ రావు ఎప్పుడూ ముందుండేవారు. కానీ కొన్ని రోజులుగా చంద్ర‌బాబు పేరు ఆయ‌న నోట వినిపించ‌లేదు. కానీ చాలా రోజుల తర్వాత చంద్ర‌బాబును హ‌రీష్‌ రావు విమ‌ర్శించారు.  వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న హ‌రీష్‌ రావు చంద్ర‌బాబును టార్గెట్‌ గా చేసుకుని ఫైర్ అయ్యారు.

 మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలోని క‌ల్వ‌కుర్తి సాగునీటి పథ‌కం కెపాసిటీని పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను గ‌తంలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కేంద్రానికి - కృష్ణా రివర్ బోర్డుకు దీనిపై లేఖ రాసింది.ఈ అంశంపై హరీష్ రావు మాట్లాడుతూ కరవుకోరల్లో ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు నీరు అందించే ఈ స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దారుణమని విమ‌ర్శించారు. తెలంగాణ విష‌యంలో చంద్రబాబు మరో సారి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారని హరీష్ రావు విమర్శించారు.చంద్రబాబు రెండు రాష్ట్రాలు సమానమే అని చెబుతూ ,ఆచరణలో మాత్రం బిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతకాలంగా రెండు ప్రభుత్వాల మధ్య పెద్దగా వివాదాలు లేకుండా ,విమర్శలు లేకుండా సాగుతున్న ఈ తరుణంలో వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో  హ‌రీష్ ఈ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
Tags:    

Similar News