మాట చెల్లాలంటే మామ ఓకే చెప్పాలి సుమి

Update: 2015-09-20 04:31 GMT
ఎంత కొడుకైనా.. ఎంత మేనల్లుడైనా.. పార్టీని నడిపించటంలో.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎంతగా చెలరేగిపోయినా విషయానికి వస్తే మాత్రం ఎవరి పరిమితులు వారివేనన్న విషయాన్ని ముఖ్యమంత్రి తన చేతల్లో చూపిస్తున్నారా? ఎక్కడైనా బావే కానీ వంగతోట వద్ద కాదన్న సామెతకు తగ్గట్లే పాలన విషయంలో తన మాట తప్పించి.. మరెవరీ మాటను వినాల్సిన అవసరం లేదని.. నిర్ణయాత్మకమైన అంశాల్లో తనకు తెలీకుండా.. తన దృష్టికి రాకుండా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దన్న మాటను అధికారులకు విస్పష్టంగా కేసీఆర్ చెప్పేశారా? అన్న సందేహాలకు సమాధానం దొరికిన చందంగా తాజా పరిణామం ఉందని చెప్పొచ్చు.

తెలంగాణ సర్కారులో తల కేసీఆర్ ది అయితే.. చేతులు.. కాళ్లుగా చెప్పుకునే ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ రావులు అన్న విషయం తెలిసిందే. అయితే.. వారికి సైతం పరిధులు ఉన్నాయని.. వారు చెప్పినంత మాత్రాన పనులు జరిగిపోవన్న విషయం తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బయటపడింది.

ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు హరీశ్.. కేటీఆర్ లు మిడ్ మానేరు రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురి అవుతున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గ్రామాలకు సంబంధించిన ఒక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చిన దాని ప్రకారం చెల్లించాల్సిన పరిహారానికి రూ.250కోట్లు అదనంగా అవసరమవుతాయని తేలింది.

దీంతో ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు ఆర్తిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్రకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు సినిమాలో మాదిరి.. అలా ఆదేశం వచ్చిన వెంటనే.. ప్రదీప్ చంద్ర స్పందిస్తూ.. ఆర్థిక వ్యవహారం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం లేనిదే నిధుల విడుదల సాధ్యం కాదని చెప్పేశారు. తొలుత నిధులు లేవని చెప్పిన ఆయనపై మంత్రి హరీశ్ అగ్రహం వ్యక్తం చేస్తూ.. తాము ఏమడిగినా నిధులు లేవని చెబుతున్నారని.. ఇలాగైతే ప్రాజెక్టులు పూర్తి చేయటం ఎలా? అన్న నిలదీతతో.. అసలు విషయాన్ని ప్రదీప్ చంద్ర చెప్పేశారు.

ఎవరైనా సరే.. తెలంగాణ ప్రభుత్వంలో జరిగే అన్ని అంశాలు తనకు తెలిసేలా నిర్ణయాలు తీసుకోవాలని.. తన దృష్టికి రాకుండా ఏనిర్ణయం తీసుకోకూడదన్న విషయంలో కేసీఆర్ ఎంత పక్కాగా ఉన్నారన్న విషయం తాజా సమీక్షా సమావేశం చెప్పేసిందంటున్నారు. ఎంత మేనల్లుడు అయినా.. మామ మాట లేకుండా నిధుల విడుదల సాధ్యం కాదని తేలిపోయినట్లే.
Tags:    

Similar News