హ‌రీశ్‌ కు పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది

Update: 2019-03-30 04:49 GMT
ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు.. మాజీ మంత్రి క‌మ్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తుండ‌గా చోటు చేసుకున్న ప్ర‌మాదం నుంచి ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో ఎవ‌రికి ఏమీ కాక‌పోవ‌టంతో టీఆర్ ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

మెద‌క్ జిల్లాలోని తూప్రాన్ లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు హ‌రీశ్‌. ఇందులో భాగంగా ఆయ‌న రోడ్ షోను చేప‌డుతూ.. వాహ‌నం నుంచి మాట్లాడుతున్నారు. జ‌న‌రేట‌ర్ వేడెక్కి తొలుత పొగ‌లు వ‌చ్చాయి. అంత‌లోనే మంట‌లు చెల‌రేగాయి. ఈ విష‌యాన్ని గుర్తించిన కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్త‌మై మంట‌ల్ని అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

మంట‌ల్ని గుర్తించిన వెంట‌నే వాహ‌నం మీద నుంచి హ‌రీశ్‌.. ఇత‌ర టీఆర్ ఎస్ నేత‌లు వెంట‌నే దిగేశారు. వాహ‌నానికి దూరంగా వెళ్లిపోయారు. హ‌రీశ్ తో పాటు ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఎమ్మెల్యే మ‌ద‌న్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఫ‌రూక్ హుస్సేన్ త‌దిత‌రులు వాహ‌నానికి దూరంగా వెళ్లారు.

టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు మంట‌ల్ని ఆర్పేశారు. క్ష‌ణాల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్క‌డి వారికి షాకింగ్ గా మారింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం కావ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. టైం బాగోని వేళ‌.. జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండండి హ‌రీశ్ అన్న మాట‌లు కొంద‌రు గులాబీ నేత‌ల నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.
 
Tags:    

Similar News