ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది.. గెలుపుపై మరీ అంత ధీమా మాటలెందుకు హరీశ్?

Update: 2021-03-12 07:30 GMT
ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. ఏదో ఒక సందర్భంలో సదరు ఎన్నికల ఫలితం ఏ రీతిలో ఉందన్న మాట ఆయన చెప్పేస్తారు. తనవద్ద రిపోర్టులు ఉన్నాయని.. తాను చెప్పినట్లే ఫలితం వస్తుందని చెప్పేవారు. దుబ్బాక గురించి ఆయన మౌనంగా ఉండటం.. అది కాస్తా దెబ్బ పడటం.. గ్రేటర్ ఎన్నికల వేళలోనూ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న మాట కేసీఆర్ నోట రాకపోవటం గుర్తుండే ఉంటుంది. తాజాగా జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఆయన ఇప్పటివరకు ఎలాంటి మాట చెప్పలేదు.

ఇలాంటివేళ.. మంత్రి హరీశ్ చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. రెండు పట్టభద్రుల ఎన్నికల్ని టీఆర్ఎస్ గెలవటం ఖాయమన్న మాటను చెబుతున్నారు. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరిస్తున్న వారిలో హరీశ్ ఒకరు. తాజాగా జరుగుతున్న రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అదే పనిగా చెబుతున్నారు.

 కేసీఆరే.. మౌనంగా ఉంటూ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటిసవాళ్లు విసరని వేళ.. అందుకుభిన్నంగా హరీశ్ అదే పనిగా గెలుపు మాట చెప్పటం ఎందుకన్న మాట వినిపిస్తోంది. అదే పనిగా గెలుపు ధీమా ప్రదర్శించి.. రేపొద్దున తేడా కొడితే.. హరీశ్ కు ఆ మాత్రం కూడా తెలీదా? అన్న మాటే కాదు.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటున్నారు. అందుకే.. ఆయన్ను అభిమానించే వారు.. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు గురించి.. అట్టే మాట్లాడకుండా తనకు అప్పగించిన పని పూర్తి చేసి ఊరుకుంటే మంచిదని చెబుతున్నారు. మరి.. ఈ సూచన హరీశ్ కు ఎప్పటికి చేరుతుందో?
Tags:    

Similar News