కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ ప్లాప్ షోగా మారిందా?

Update: 2022-11-05 04:11 GMT
బ్రాహ్మండం బద్దలు కొడుతున్న తీరులో.. భారీ ఎత్తున పార్టీ నేతల్ని పక్కన పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ పెను సంచలనంగా మారటం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసిన వైనానికి సంబంధించిన గంట నిడివి ఉన్న వీడియో ఫుటేజ్ ను మీడియా ఎదుట ప్రదర్శించటంతో పాటు.. దానిని అన్ని మీడియా హౌస్ లకు.. సుప్రీంకోర్టు మొదలు అన్ని న్యాయస్థానాలకు.. వివిధ పార్టీలకు పంపినట్లుగా చెప్పారు. మొత్తం మూడు గంటల వీడియో ఫుటేజ్ ఉంటే.. దానిని గంటకు కుదించినట్లుగా పేర్కొన్నారు.

తాను ఎంతో వేదన చెందుతూ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్న ఆయన.. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ పెను సంచలనంగా మారుతుందని.. దేశ వ్యాప్తంగా రియాక్షన్లు వస్తాయని కేసీఆర్ అండ్ కో భావించారు. అందుకు భిన్నంగా ఎలాంటి స్పందన లేకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

మొత్తంగా ఈ ప్రెస్ మీట్ ప్లాప్ షోగా పలువురు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన వీడియోలో.. బీజేపీ తరఫు మధ్యవర్తులుగా పేర్కొనటంతో పాటు.. వారు గతంలో తాము వివిధ ప్రబుత్వాల్ని పడగొట్టటంలో కీలకభూమిక పోషించినట్లుగా చెప్పటం కనిపించింది.

అంతేకాదు..ఏ రాష్ట్రాన్ని ఏ రీతిలో పడగొట్టామన్న విషయాన్ని వివరంగా చెప్పిన వైనం.. వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యింది. అయినప్పటికీ ఇదేమాత్రం సంచలనంగా మారలేదు? జాతీయ మీడియా దీన్ని ఎందుకు పట్టించుకోలేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనికి చెబుతున్న కారణాల్లో ముఖ్యమైనది.. మొదట విడుదల చేసిన ఆడియో క్లిప్ కు.. వీడియో క్లిప్ లోని అంశాలు ఒకటే కావటం.. బీజేపీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా చెప్పే ఆధారాలు ఏమీ లేకపోవటం కూడా కారణమని చెబుతున్నారు.

అన్నింటికి మించి.. ఎర వేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు.. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారు కావటం.. వారిని పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ ఏం చేశారో చెబుతారా? అన్న ప్రశ్నలు తలెత్తటం కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయినట్లుగా చెబుతున్నారు.

విలువల గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న కేసీఆర్.. ఇప్పుడు ఎర వేసిన ఎమ్మెల్యేల వెనున ఉన్న చరిత్ర కూడా పెద్దగా ప్రభావం చూపించలేదన్న మాట వినిపిస్తోంది. ఏదో జరుగుతుందని.. ఇంకేదో సంచలనం ఖాయమని బలంగా నమ్మిన వారంతా కేసీఆర్ అంత పెద్ద ప్రెస్ మీట్ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్టు కావటం.. ఏ ప్రముఖ పార్టీ అధినేత కూడా దీనిపై మాట్లాడకపోవటం.. ప్లాప్ షో కిందకు వస్తుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News