బాబు స‌హాయ నిరాక‌ర‌ణ‌!... జ‌గ‌న్ కేసు క‌దిలేదెలా?

Update: 2019-01-05 16:14 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హ‌త్యాయత్నం కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌... హైద‌రాబాదు బ‌య‌లుదేరేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వ‌చ్చిన సంద‌ర్భంగా ఎయిర్ పోర్టు క్యాంటీన్ ప‌నిచేస్తున్న శ్రీ‌నివాస‌రావు అనే యువ‌కుడు కోడి కాళ్ల‌కు క‌ట్టే క‌త్తితో దాడికి దిగాడు. అయితే ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ చాక‌చక్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ దాడి నుంచి చిన్న గాయంతో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే ఎయిర్ పోర్టులో అది కూడా ఏపీలో విప‌క్ష నేత హోదాలో కొన‌సాగుతున్న జ‌గ‌న్‌ పై దాడి జ‌ర‌గ‌డం పెను సంచ‌ల‌నంగా మారింది. ఈ దాడిపై అప్ప‌టికప్పుడే స్పందించేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్‌.. దాడిని త‌క్కువ చేసి చూపే య‌త్నం చేశారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టులో భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త కేంద్ర బ‌ల‌గాల‌దేన‌ని చెప్పిన ఆయ‌న రాష్ట్ర పోలీసుల వైఫ‌ల్య‌మేమీ లేద‌ని కూడా త‌మ‌కు తాము స‌ర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ఇక జ‌గ‌న్‌ పై నిత్యం విరుచుకుప‌డే అధికార టీడీపీ నేత‌లు డీజీపీ వ్యాఖ్య‌ల‌నే ప‌ట్టుకుని నానా ర‌భ‌స చేశారు. చివ‌ర‌కు సీఎం కూడా దాడిని త‌క్కువ చేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటుగా జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోన వైసీపీకి ఏకంగా కోడిక‌త్తి పార్టీ అంటూ హేళ‌న చేయ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌నే చెప్పాలి. ఓ ప్ర‌తిప‌క్ష నేత‌ పై జ‌రిగిన దాడిని ఖండించి, బాధితుడి ప‌రామ‌ర్శించాల్సిన క‌నీస బాధ్య‌త‌ను మ‌రిచిన సీఎం చంద్ర‌బాబు... త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసి త‌న‌ను తాను త‌క్కువ చేసేసుకున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా.. కేంద్ర బ‌ల‌గాల ప‌రిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తాము చేప‌ట్టమ‌ని చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం కేసు ద‌ర్యాప్తున‌కు మాత్రం ఆస‌క్తి చూపింది. ఆస‌క్తి చూప‌డ‌మే కాకుండా... కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల చేత ద‌ర్యాప్తు చేయించాల‌న్న జ‌గ‌న్ విజ్ఞ‌ప్తిపై చ‌వ‌క‌బారు విమ‌ర్శ‌లు చేసింది. అయితే జ‌గ‌న్ కోర్టుకెక్క‌డంతో కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు ఇప్పుడు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌కు బ‌దిలీ అయిపోయాయి. ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు అప్ప‌టిక‌ప్పుడే రంగంలోకి దిగేసిన ఎన్ ఐ ఏ... కేసు న‌మోదు చేయ‌డంతో పాటుగా ద‌ర్యాప్తును ప్రారంభించేసిన‌ట్టుగా ప్ర‌క‌టించింది. అయితే అప్పటిదాకా ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల కోస‌మంటూ ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) వ‌ద్ద కేసు వివ‌రాల‌న్నీ ఉండిపోయాయి. ఈ వివరాల‌ను తీసుకునేందుకు నేటి మ‌ధ్యాహ్నం ఎన్ ఏ ఐ అధికారులు సిట్ కార్యాల‌యానికి వెళ్లార‌ట‌. వాస్త‌వంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లంటే గౌవ‌రం ప్ర‌ద‌ర్శించాల్సిన సిట్ అధికారులు... అందుకు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా వార్త‌లు వెలువడుతున్నాయి. కేసు వివ‌రాల‌ను ఇప్ప‌టికిప్పుడు అందించేది లేద‌ని సిట్ అధికారులు నిర్మోహ‌మాటంగా ఎన్ఐఏ అధికారుల‌కు ముఖం మీదే చెప్పార‌ట‌. అయినా హైకోర్టు ఆదేశాల మేర‌కు కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు తీసుకున్న ఎన్ ఐ ఏ కు కేసు వివ‌రాలు అందించేందుకు సిట్‌ కు వ‌చ్చిన ఇబ్బంది ఏమిట‌న్న‌ది ఇక్క‌డ అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కే సిట్ అధికారులు ఎన్ ఐ ఏ అధికారుల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది.

అయితే వివ‌రాల నిరాక‌ర‌ణ‌కు సిట్ అధికారులు ఏదో ఒక కార‌ణం చెప్పాల్సిందే క‌దా. అలా కార‌ణం కూడా వెతికిపెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం... మొన్న‌టికి మొన్న ఈ కేసు పై మీడియా స‌మావేశం పెట్టి త‌న‌దైన శైలి కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేశ్ చంద్ర లడ్హాను సెల‌వు పై పంపి, క‌మిష‌న‌ర్ వ‌చ్చే దాకా వివ‌రాల అంద‌జేత కుద‌ర‌ద‌ని సిట్ అధికారుల చేత ఎన్ ఐ ఏ కు చెప్పించిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా క‌మిష‌న‌ర్ సెల‌వులో ఉంటే... త‌న బాధ్య‌త‌ల‌ను ఆయ‌న ఎవ‌రికో ఒక‌రికి అప్ప‌గించే ఉంటారు క‌దా... అలాంట‌ప్పుడు ఉన్న‌తాధికారుల అనుమ‌తి అన్న‌ది సాకుగానే క‌నిపిస్తోంది. మొత్తంగా ఈ కేసులోని అస‌లు వాస్త‌వాల‌ను బ‌య‌ట‌కు రాకుండా చేసే క్ర‌మంలోనే చంద్ర‌బాబు స‌ర్కారు ఈ త‌ర‌హా స‌హాయ నిరాక‌ర‌ణ‌కు పూనుకున్న‌ట్లుగా కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా త‌న‌కు ఇబ్బంది క‌లిగించే అంశాల్లో చంద్ర‌బాబు... త‌న మార్కు పోలీసింగ్‌ తో కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌కే ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు వేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌మిష‌న‌ర్ ఈ నెల 8 దాకా సెల‌వు పెట్టార‌ని, క‌మిష‌న‌ర్ తిరిగి వ‌చ్చిన తర్వాత కేసు వివ‌రాల అంద‌జేత‌ పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సిట్ చెబుతున్న విష‌యం పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంటే... ఈ నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ఎన్ ఐ ఏ కు అంద‌జేయ‌కూడ‌ద‌ని భావిస్తున్న ఆధారాల‌ను ధ్వంసం చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన పని లేద‌న్న వినిపిస్తోంది.






Full View
Tags:    

Similar News