టీటీడీపీ అధ్యక్షుడిగా ఈయనే.. చంద్రబాబు డిసైడ్

Update: 2021-07-18 05:30 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్థానమైనట్టే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్న ఎల్.రమణ  తాజాగా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఆఖరి ఆశ కూడా తెలంగాణలో ఆవిరైపోయింది. తెలంగాణలోని తెలుగు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక టీడీపీ తెలంగాణలో ఇన్నాళ్లు ఒంటరిగా పోటీచేయలేకపోయింది. అది కాంగ్రెస్ తో కలిసి గత ఎన్నికల్లో తలపడింది. ఎల్.రమణ రాజీనామాతో ఇప్పుటు రాష్ట్రంలో పూర్తిగా టీటీడీపీ దుకాణం మూసివేసినట్టైంది.

ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని సజీవంగా ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడట.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ సీట్లు గెలిచే అవకాశాలు పూర్తిగా లేవని తెలిసి కూడా.. అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ టీడీపీ చీఫ్ పదవికి గట్టి పోటీ ఉన్నట్లుగా చంద్రబాబు మీడియా బృందం  తెగ ఊదరగొడుతోంది. ఎల్.రమణ జంపింగ్ ను తక్కువగా చూపుతోంది. ఆయన పోయినా ఏం ఫర్వాలేదు అన్నట్టుగా చెబుతోంది. ఇక చంద్రబాబు సైతం కుల సమీకరణాలు, ప్రజాదరణ, సినియారిటీ, కొత్త అధ్యక్షుడిని నియమించడానికి విధేయత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిని నియమించడానికి రెడీ అయ్యారు. ఇప్పటిదాకా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఒకరిని అధ్యక్షుడిగా నియమించడానికి రెడీ అయినట్లు తెలిసింది.

తెలంగాణ టీడీపి నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులను నియమించే అవకాశం ఉంది. బక్కని నర్సింహులు చాలా కాలంగా  చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్నారు. ఈయన 1994-1997 వరకు షాద్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ..పార్టీ మారకుండా చంద్రబాబుకు, టీడీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. వివిధ నామినేటెడ్ పోస్టుల లోనూ నర్సింహులకు చంద్రబాబు అవకాశం ఇచ్చాడు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా నర్సింహులును నామినేట్ చేశాడు. తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శి పదవి కూడా ఇచ్చాడు.

ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీడీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. మొదట టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్త కోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల వారు ఈ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే షెడ్యూల్ కులాలకు చెందిన బక్కని నర్సింహులును సామాజిక కోణంలో చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలిసింది. బీసీల పార్టీ అయిన టీడీపీకి ఈయన ఎంపిక సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.

ఇక ఒకటి రెండు రోజుల్లోనే టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంతోపాటు కొత్త టీటీడీపీ చీఫ్ గా బక్కాని నరసింహులు పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
Tags:    

Similar News