గుజరాత్ గజ గజ : బీజేపీకి ఆప్ సవాల్.. పీఠం కోసం కాంగ్రెస్ ...?

Update: 2022-11-04 08:03 GMT
దేశంలో అందరి దృష్టిని ఆకర్షించే రాష్ట్రంగా గుజరాత్ ఇపుడు ఉంది.  దేశ ప్రధాని హోం మంత్రి సొంత రాష్ట్రం అది. అక్కడ చీమ చిటుక్కుమంటే దేశం మొత్తం చూస్తుంది. దానికి కారణం అక్కడ రాజకీయ ప్రకంపనలు దేశమంతా కనిపిస్తాయి వినిపిస్తాయి. గుజరాత్ లో బీజేపీని అవుట్ చేసి పారేస్తే ఇక దేశంలో 2024 లో జరిగే ఎన్నికల్లో మోడీ సర్కార్ ని  ఈజీగా కొట్టవచ్చు అన్నది విపక్షాల మాస్టర్ ప్లాన్. కానీ గుజరాత్ అంటేనే బీజేపీ. అక్కడ ప్రత్యర్ధుల ప్లాన్స్ ఫలిస్థాయా అన్నదే కీలకమైన పాయింట్.

గుజరాత్ ని బీజేపీ ఇప్పటికి అయిదు సార్లు గెలుచుకుంది. 27 ఏళ్ల నుంచి గుజరాత్ పీఠం మీద బీజేపీ కూర్చుని ఉంది ఈ మొత్తం 27 ఏళ్లలో మోడీ ముఖ్యమంత్రి వాటా  పదమూడేళ్ళు. అంటే సగం పాలన మోడీ జమానాలోనే సాగింది అన్న మాట. దానికంటే ముందు 1995లో గుజరాత్ లో మొదటిసారిగా బీజేపీ అధికారంలోకి రావడం వెనక మోడీ ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. బీజేపీలో కీలకమైన భూమిక ఆయన నాడు పోషిస్తూ ఉండేవారు. బీజేపీ గెలుపు కోసం పక్కా వ్యూహాలను ఆయన రూపొందించి  కేశూభాయ్ పటేల్ ని సీఎం చేయడంలో ఎంతో శ్రమించారు.
 
అయితే కేశూభాయ్ పటేల్ పాలనల్లో బీజేపీలో ముసలం మొదలైంది. ఆ తరువాత సురేష్ మెహతా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ లోగా బీజేపీ చీలిపోవడంతో కాంగ్రెస్ తో చేతులు కలిపి శంకర్ సింఘ్ వాఘేలా సీఎం అయ్యాడు. అలా 1998 నాటికి మధ్యతర ఎన్నికలు వచ్చాయి. మళ్లీ బీజేపీని నరేంద్ర మోడీ గెలిపించారు. తిరిగి కేశూభాయ్ పటేల్ సీఎం అయ్యారు. ఈసారి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు సాగింది.

అయితే బీజేపీలో ఉన్న విభేదాలు వర్గపోరు నేపధ్యంలో అధినాయకత్వం సూచనల మేరరకు అప్పటిదాకా కనీసం ఎమ్మెల్యే కూడా కాని నరేంద్ర మోడీ 2001లో మొదటిసారి సీఎం అయ్యారు. ఆ తరువాత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఆయన గెలిపించారు. అలా 2014 వరకూ 13 ఏళ్ళ పాటు మోడీ పాలించారు. 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.

అయితే మోడీ గుజరాత్ ని వదిలేసాక బీజేపీకి సరైన నాయకత్వం మాత్రం లేదనే చెప్పాలి. 2017లో దాని ఫలితంగా 182 సీట్లకు గానూ 99 మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. పటేల్ ఉద్యమాన్ని నిర్వహించిన హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ కి 77 సీట్లు దక్కాయి. అయితే గత అయిదేళ్ల కాలంలో కాంగ్రెస్ బాగా తగ్గిపోయింది. అదే టైం లో ఆప్ అక్కడ పాగా మోపింది.

ఆప్ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఏకంగా 27 కార్పోరేటర్లను 2021లో జరిగిన ఎన్నికల్లో ఆప్ గెలుచుకోవడంతో గుజరాత్ మీద ఆ పార్టీకి ఆశలు చిగురించాయి. నాటి నుంచి అక్కడ పట్టు కోసం ఆప్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ నుంచి హార్ధిక్ పటేల్ వంటి వారు బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కి నాయకత్వ సమస్య ఉంది. లీడర్ షిప్ ఐక్యంగా లేదు. ఈ వాతావరణాన్ని తనకు అనువుగా మార్చుకోవడానిక్ ఆప్ అక్కడ రంగంలోకి దిగింది.

అరవింద్ క్రేజీవాల్ రోడ్ షోలకు సభలకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాంతో గుజరాత్ లో తామే జెండా ఎగరేస్తామని ఆయన నిబ్బరంగా చెబుతున్నారు. అయితే ఫస్ట్ టైం గుజరాత్ బరిలో దిగుతున్న ఆప్ కి అభిమానులు ఉన్నరు కానీ పటిష్టమైన క్యాడర్ లేదు. దాంతో ఓటింగ్ ఎంత తెచ్చుకున్నా సీట్లు మాత్రం పెద్దగా రావు అనే విశ్లేషణలు ఉన్నాయి. పైగా ఆప్ అక్కడ రంగ ప్రవేశం చేయడం వల్ల కాంగ్రెస్ పూర్తిగా నష్టపోతుంది అన్న లెక్కలు ఉన్నాయి.

ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం ఏ విధంగా దెబ్బ తిందో ఆ విధంగా ఆప్ వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని అంటున్నారు. ఆ విధంగా విపక్ష ఓటర్ల చీలిక వల్ల బీజేపీకి మరోసారి ఇక్కడ అధికారం ఖాయమని అంటున్నారు. అదే టైం లో ఆప్ హిందూత్వ నినాదాన్ని తాను వల్లిస్తోంది. ఆప్ ని గుజరాత్ లో గెలిపిస్తే అయోధ్యలు ఓటర్లను అందరినీ తీసుకెళ్తాను  కేజ్రీవాల్ క్రేజీ వరాన్ని ఇచ్చారు. పైగా లక్ష్మీ దేవి వినాయకుడి బొమ్మలను కరెన్సీ మీద ముద్రించమని ఆయన డిమాండ్ చేయడం ద్వారా బీజేపీ హిందూత్వ ఓటింగ్ కి ఎసరు పెడుతున్నారు.

దాంతో 27 ఏళ్ళ పాలనను చూసిన వారు మార్పు కోసం కనుక ఆలోచిస్తే బీజేపీ ఓటింగ్ కి కూడా డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ 182 సీట్లకు గానూ 150 గెలవాలని బిగ్ టార్గెట్ పెట్టుకుంది. అయితే అది అంత ఈజీ కాదని అంటున్నారు. రీసెంట్ గా జరిగిన మోర్బీ  తీగల వంతెన కూలడం కూడా అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వసే ప్రియాంకా గాంధీ ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. రాహుల్ పాదయాత్ర నుంచి వెనక్కి వచ్చే సంస్య లేదు. ఇక కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గెకు ఇది తొలి పరీక్ష అవుతుంది. ఎంత కాంగ్రెస్ కష్టపడినా గెలుపు అవకశాలు కష్టమనే అంటున్నారు. పైగా గతంలో వచ్చిన 77 సీట్లను కూడా నిలబెట్టుకోవడం కష్టమనే అభిప్రాయం  ఉంది.

మొత్తం మీద చూస్తే ఆప్ రంగ ప్రవేశం మూలంగా తొలి దెబ్బ కాంగ్రెస్ కి పడుతుంది అంటున్నారు. దీంతో అధికారంలోకి రావడానికి సరిపడా సీట్లను బీజేపీ తెచ్చుకోవచ్చు అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఆప్ ఓట్లను ఎక్కువ తీసుకుని ఈసారికి సంతృప్తికరమైన  సీట్లను సాధిస్తే మాత్రం బీజేపీకి అసలైన సవాల్ 2024 నాటికి ఆప్ మాత్రమే ఇస్తుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News