సరిహద్దుల వద్ద పాక్ ఆరాచకం

Update: 2015-08-17 05:17 GMT
ఒకవైపు తియ్యతియ్యటి మాటలు చెబుతూనే.. చేతల్లో తన కపటత్వాన్ని ప్రదర్శించే పాకిస్థాన్ గత రెండు రోజులుగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో చెలరేగిపోతోంది. గత కొద్ది రోజులుగా ఆ దేశ సైన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు పాల్పడటంపై కలకలం రేగుతోంది. గత ఎనిమిది రోజుల్లో పాక్ సైన్యం జరుపుతున్న కాల్పుల కారణంగా.. ఒక్క శని.. ఆదివారాల్లోనే ఆరుగురు అమాయకులు మరణించగా.. పది మంది వరకూ గాయపడిన పరిస్థితి.

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని పల్లెలు.. ఆర్మీపోస్టులపై పాక్ బలగాలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతోంది. సరిహద్దులోని ఫూంచ్ జిల్లాలోని పూంచ్.. రాజౌరీ.. బాలాకోట్.. హమీర్పూర్.. మండీ సెక్టార్లలో పాక్ బలగాలు చెలరేగిపోతున్నాయి. పాక్ బలగాలు ఓవర్ యాక్షన్ పై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ కు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికీ సరిహద్దుల వెంట కాల్పులు సాగుతున్నాయని.. పాక్ సైన్యానికి ధీటుగా భారత సైన్యం రెండు.. మూడు రెట్లు జవాబు ఇస్తున్నట్లు భారత సైనికవర్గాలు చెబుతున్నాయి. సరిహద్దుల్లోని పాక్ తీరుపై ఆదివారం ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ను పిలిపించుకొన్న విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాద్వా.. తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. శాంతికి తూట్లు పొడవకుండా పాక్ సైన్యాన్ని పాక్ సర్కారు అదుపులో ఉంచుకోవాలని సూచించారు. మరోవైపు.. పాక్ ఆర్మీ మాత్రం తప్పంతా భారత్ దే అంటూ వ్యాఖ్యలు చేస్తోంది.

భారత సేనలు తమను రెచ్చగొడుతున్నట్లుగా పాక్ సైన్యం ఆరోపిస్తోంది. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ బాసిత్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత్ ఇప్పటివరకూ 70సార్లు కాల్పులు జరిపినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం వైఖరిని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమాయకు పౌరుల్ని లక్ష్యంగా చేసుకొని ఇస్లామికేతర చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ వ్యాఖ్యానించారు. మొత్తంగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News