శివాజీ మాట‌!.. బొక్క‌లెందుకు అన్న‌య్యా?

Update: 2018-02-12 10:04 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక రైల్వే జోన్ స‌హా ఇత‌ర‌ విభ‌జ‌న హామీల అమ‌లుకు అందరికంటే ముందుగానే పోరాటంలోకి దిగేసి... ఆ త‌ర్వాత విరామం ప్ర‌క‌టించేసినట్టుగా వ్య‌వ‌హరించిన టాలీవుడ్ హీరో శివాజీ... మ‌ళ్లీ రంగంలోకి దిగేసిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. ఇప్పటికే మోదీ స‌ర్కారు త‌న ఐదేళ్ల టెర్మ్ లో భాగంగా ప్ర‌వేశ‌పెట్టిన తాజా బ‌డ్జెట్‌ లో ఏపీకి కేటాయింపులేమీ చేయ‌ని విష‌యంపై టీడీపీ స‌హా ఇత‌ర పార్టీలు కూడా ఒకింత నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇత‌ర పార్టీల ప‌రిస్థితి ఎలా ఉన్నా... నాలుగేళ్లుగా మొద్దు నిద్ర పోయి ఇప్పుడు ఏపీకి అన్యాయం జ‌రిగిపోయిందంటూ టీడీపీ ఎంపీలు చేస్తున్న నిర‌స‌న‌ల‌పై సెటైర్ల వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రంగంలోకి దిగేసి... త‌న‌తో ఒక్క‌డితో పోరాటం అయ్యే ప‌ని కాద‌న్న రీతిలో లోక్ స‌త్తా నేత జ‌య‌ప్రకాశ్ నారాయ‌ణ‌ - సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ లో క‌లిసి ముందుకు సాగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మేథావుల‌తో ఓ నిజ నిర్ధార‌ణ క‌మిటీని వేస్తాన‌ని, ఆ క‌మిటీ...  ఇప్ప‌టిదాకా కేంద్రం ఏపీకి ఏ మేర‌కు నిధులిచ్చింద‌న్న దానిని నిగ్గు తేలుస్తామంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఈ క‌మిటీని ఉద్దేశించి తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా శివాజీ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ వైఖ‌రిని సుత్తి లేకుండా సూటిగానే దునుమాడేసిన శివాజీ... ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు ప్ర‌స్తావించ‌కుండా... *అన్న‌య్యా* చేసిన వ్యాఖ్య‌లు ఈ వ‌దంతుల‌కు కార‌ణంగా చెప్పుకోవాలి. స‌ద‌రు ట్వీట్ల‌లో బీజేపీపై ఓ రేంజిలో ఫైర్ అయిన శివాజీ... బీజేపీ స‌ర్కారుతో పాటుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు - విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుతో పాటుగా ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడిపైనా విరుచుకుప‌డ్డారు. శివాజీ ట్వీట్లు ఎలా సాగాయంటే... *రోడ్లకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. 67 వేల కోట్లకే లెక్క చెప్పారు. మిగితావి ఎవరికిచ్చారు ? . మీరిచ్చిన దొంగ లెక్కలు - అంకెలు కూడితే 5 లక్షల కోట్లు . స్టీల్ ప్లాంట్  - దుగరాజపట్నం పోర్టు కలిపితే 12 లక్షల కోట్లు దాటతాయి. అసలు కేంద్ర బడ్జెట్ ఎంతో మీ మట్టి బుర్రలకి తెలుసా ? అబద్ధాలు అంకెల్లో చెబితే నిజాలైపోతాయా ? హరిబాబు ఎప్పుడైనా ఆంధ్ర సమస్యలపై 10 నిమిషాలు పార్లమెంటులో మాట్లాడారా ? 27 పేజీల లేఖలో రైల్వే జోన్ మర్చిపోయావేం ? విశాఖ హరిబాబూ ?* అంటే శివాజీ త‌న‌దైన శైలిలో రెచ్చిపోయార‌నే చెప్పాలి. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... ఆ తర్వాత శివాజీ చేసిన కొన్ని ట్వీట్లు మాత్రం పవన్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ని వ్యతిరేకిస్తున్నట్టు ఉంది.

ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క వాదన తో ప్రజలని తికమక పెడుతుండటంతో... జేపీ - ఉండవల్లి తదితరులతో పవన్ కళ్యాణ్ ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై శివాజీ ప‌రోక్షంగా ఆస‌క్తికర కామెంట్లు చేశారు. భారత దేశం లో ఏ రాష్ట్రం లోనూ అవినీతి రహిత పాలన లేదనేది సామాన్యుడి అభిప్రాయం. ఈ లెక్కన - ఈ కమిటీ అధ్యయనం లో బీజేపీ ఇవ్వకుండా వదిలేసిన లెక్కలతో పాటు, బీజేపీ ఇచ్చిన డబ్బులతో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిన లెక్కలు కూడా బయటికి వచ్చే అవకాశముందన్న వాద‌న వినిపిస్తోంది. ఈ విషయం లో టీడీపీకి మద్దతిస్తూ పవన్ ని శివాజీ భవిష్యత్తు లో విభేదిస్తాడేమో అనిపించేలా ఆ ట్వీట్లున్నాయి. *మనకు విభజన చట్టం ముఖ్యం. ప్రత్యేక హోదా - రైల్వే జోన్ - ఉత్తరాంధ్ర – రాయలసీమ ప్యాకేజ్ - ఉక్కు ఫ్యాక్టరీ - పోలవరం - రాజధాని ముఖ్యం. ఇవి వదిలేసి ఈ లెక్కల బొక్కలు వెతకటం ఏమిటి అన్నయ్యా ? నాకో విషయం అర్ధం కావడం లేదు. సెంటర్ ఏపీకి ఏమిచ్చింది, ఏపీ ఇచ్చిందాన్ని ఏం చేసింది, ఇవన్నీ కాగ్ చూసుకుంటుంది* అంటూ శివాజీ ట్వీటారు. అంటే కేవలం బీజేపీ చేసిన అన్యాయం వరకే మాట్లాడదాం, టీడీపీ దుర్వినియోగం చేసిన నిధుల సంగతి ఇప్పుడు మాట్లాడొద్దు అన్నట్టుగా శివాజీ ట్వీట్లున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News