టీడీపీకి షాక్‌..ఆ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు

Update: 2017-04-25 10:26 GMT
తెలుగుదేశం పార్టీకి రాష్ర్ట సర్వోన్నత న్యాయస్థానం నుంచి మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. విజయవాడ రోడ్డు రవాణా సంస‍్థ (ఆర్‌టీఏ) కమిషనర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో టీడీపీ ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని - టీడీపీ  ఎమ్మెల్యే  బోండా ఉమ మహేశ్వర్ రావు - మేయర్ కోనేరు శ్రీధర్‌ - ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న - ఏపీ డీజీపీ - విజయవాడ సీపీల తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఓ దినపత్రికలో వచ్చిన కథనాలను పిల్‌ గా స్వీకరించిన హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ సంద‌ర్భంగా ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఆయ‌న‌ భద్రతా సిబ్బంది, ఆఫీసు సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా వారిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని - ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు - ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న - సిటీ మేయర్ కోనేరు శ్రీ‌ధ‌ర్ - ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ ఎస్‌ కె నాగుల్ మీరా దుర్భాషలాటినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం తీరును ప‌లువురు తీవ్రంగా విమ‌ర్శించారు. విజయవాడలో మార్చి 27వ తేదీన జరిగిన ఈ ఉదంతంపై పార్టీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబు సైతం సీరియ‌స్ అయ్యారు. త‌న పార్టీ నేత‌ల‌కు క్లాస్ తీసుకోవ‌డంతో వారు ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌ కు క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. అయితే ప‌త్రిక‌లు, మీడియాలో వచ్చిన వార్త‌ల నేప‌థ్యంలో సుమోటోగా కేసును స్వీక‌రించ‌డమే కాకుండా నోటీసులు జారీచేయడం టీడీపీకి, ఏపీ ప్ర‌భుత్వానికి పెద్ద దెబ్బ అని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News