భార‌తి సిమెంట్స్ వాద‌న క‌రెక్టేగా!

Update: 2017-04-20 04:46 GMT
నిజ‌మే... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్థాపించిన భార‌తి సిమెంట్స్ కంపెనీకి సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కారు బొక్క బోర్లా ప‌డింద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప జిల్లాలో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కార్య‌క‌లాపాలు ప్రారంభించిన భార‌తి సిమెంట్స్‌... జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లోని సున్న‌పురాయి గ‌నుల లీజుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. నిబంధ‌న‌ల మేర‌కే ఈ గ‌నులు భార‌తి సిమెంట్స్ కు ద‌క్కాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పాల‌న త‌ర్వాత గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు... ఎలాగైనా భార‌తి సిమెంట్స్‌ ను మూసివేయించేందుకే రంగం సిద్ధం చేసిన‌ట్లు పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి.

ఈ క్ర‌మంలో భార‌తి సిమెంట్స్ పుట్టుక‌ - గ‌నుల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌న్నింటినీ ప‌రిశీలించిన బాబు అండ్ కో... ర‌ఘురాం సిమెంట్స్‌ గా ప్ర‌స్థానం ప్రారంభించి ఆ త‌ర్వాత భార‌తి సిమెంట్స్‌ గా పేరు మార్చుకున్న ఓ చిన్న అంశాన్ని ప‌ట్టుకుని వేలాడింది. అదే అంశాన్ని ఆస‌రా చేసుకుని భార‌తి సిమెంట్స్‌ పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింద‌ని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలో ర‌ఘురాం సిమెంట్స్ త‌న పేరును ప్ర‌భుత్వానికి తెల‌ప‌కుండానే భార‌తి సిమెంట్స్‌గా మార్చుకుంద‌ని, ఇది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మేన‌ని బాబు స‌ర్కారు ఓ తీర్పు ఇచ్చేసింది. సాంకేతికంగా స‌ద‌రు కంపెనీని కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశ‌మున్న ఈ అంశం ఆధారంగా బాబు స‌ర్కారు చాలానే చేసేసింది. అస‌లు పేరు మార్పున‌కు సంబంధించి త‌న‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గ‌డువులోగా స‌మాధానం ఇవ్వ‌కుంటే గ‌నుల లీజు ద‌రఖాస్తును తిర‌స్క‌రిస్తాన‌ని హూంక‌రించింది.

అయితే ఈ నోటీసుల‌కు భార‌తి సిమెంట్స్ కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన బాబు స‌ర్కారు... నోటీసుల గ‌డువు తీర‌క‌ముందే భార‌తి సిమెంట్స్ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించేసింది. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన భార‌తి సిమెంట్స్‌... ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాన్నే ఆస‌రా చేసుకుని హైకోర్టును ఆశ్ర‌యించింది, భార‌తి సిమెంట్స్ పిటిష‌న్‌ ను నిన్న విచారించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం... భార‌తి సిమెంట్స్ వాద‌న స‌రైన‌దేన‌ని చెబుతూ... భార‌తి సిమెంట్స్ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్వ‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసింది. అంతేకాకుండా... భార‌తి సిమెంట్స్ స్పందించ‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌గానే.. హ‌డావిడిగా ఆ సంస్థ ద‌ర‌ఖాస్తును ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చిందో తెల‌పాల‌ని కూడా కోర్టు బాబు స‌ర్కారుకు నోటీసులు జారీ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News