అమరావతి రైతులకు హైకోర్టు షాక్‌!

Update: 2022-11-16 11:30 GMT
అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. మూడు రాజధానులు వద్దంటూ అమరావతి నుంచి అరసవల్లి వరకు పేరుతో రైతులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులతో రైతుల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.

దీంతో రైతుల పాదయాత్రను ప్రారంభించారు. చాలా చోట్ల రైతుల పాదయాత్రకు వైసీపీ నేతలు ఆటంకాలు కలిగించారు. గుడివాడ, రాజమండ్రిల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయినా సరే రైతులు మొండిగా పాదయాత్ర కొనసాగించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం చేరుకోగానే రైతులకు గుర్తింపు కార్డులు లేవని పోలీసులు యాత్రను ఆపేసిన సంగతి తెలిసిందే.

600 మందికి మాత్రమే హైకోర్టు యాత్రకు అనుమతించిందని, అదేవిధంగా పాదయాత్ర చేస్తున్నవారు గుర్తింపు కార్డులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంటూ పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. దీంతో రైతులు తాత్కాలికంగా తమ యాత్రను ఆపేస్తున్నట్టు ప్రకటించారు.

హైకోర్టు అనుమతించినా ప్రభుత్వం వివిధ కారణాలతో తమ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆ షరతులను సడలించాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు గతంలో ఉన్న షరతులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.

600 మంది రైతులు మాత్రమే యాత్ర చేయాలని పేర్కొంది. అలాగే వారంతా గుర్తింపు కార్డులు చూపడం తప్పనిసరని వివరించింది. యాత్రలో రాజకీయ పార్టీల నేతలు ఉండకూడదని.. రైతులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది.

ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పనులు చేయొద్దని గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అనుమతులు రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించింది. ఇప్పుడు ఆ షరతులను సవరించాలని కోరిన రైతుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. గత ఆదేశాలే అమల్లో ఉంటాయని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News