రజనీకి మద్రాస్ హైకోర్టు సమన్లు

Update: 2020-12-22 04:15 GMT
కొద్ది నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత పోటాపోటీగా ఈసారి ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఎంతోకాలంగా రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీ.. ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీ తీసుకోవటం.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం తూత్తుకుడి ఆందోళన నేపథ్యంలో రజనీకాంత్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ తూత్తుకుడి ఇష్యూ ఏమటన్నది చూస్తే.. 2018లో వేదాంత స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తమిళనాడు మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన చేశారు. ఆ సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిరసకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. పదమూడు మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విషాదంగా మారిన ఈ ఉదంతం అప్పట్లో షాకింగ్ గా మారటమే కాదు.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తతకు తెర తీసింది.

ఈ వ్యవహారంపై అప్పట్లో స్పందించిన రజనీకాంత్.. ఆందోళనలో కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించటం వల్లే పోలీసులు కాల్పులు జరిపారన్నారు. దీంతో రజనీ వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. దీనిపై వివరణ కోరగా.. ఆయన చెప్పేందుకు నో చెప్పారు. తనకున్న సమాచారంతోనే తానీ వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పారు. తనకు ఎలా తెలిసిందన్న విషయాన్ని మాత్రం అడగొద్దన్న ఆయన.. తనకన్నీ తెలుసన్నారు. అయితే.. ఇది వివాదాస్పదం కావటంతో తాను చేసినవ్యాఖ్యలపై ఆ తర్వాత రజనీ క్షమాపణలు చెప్పారు. అయితే.. తన వ్యాఖ్యల్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు.

తూత్తుకూడి ఉదంతంపై మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేశారు. గతంలో ఒకసారి రజనీకి సమన్లు పంపగా..ఆయన వ్యక్తిగత సహాయకుడు హాజరై.. రజనీ హాజరయ్యేందుకు మినహాయింపు కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. వచ్చే జనవరి 19న కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. మరి.. ఈ విషయంలో రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి?


Tags:    

Similar News