లగడపాటి జోస్యంపై అనుమానాలు.. తేడావస్తే..

Update: 2019-05-18 10:09 GMT
ఆంధ్రా ఆక్టోపస్, సర్వేల స్పెషలిస్ట్ లగడపాటిని నమ్మి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పందాలు కాసినవారంతా నిండా మునిగారు. కొందరు ఇల్లు వాకిలీ అమ్ముకున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూడా లగడపాటి వచ్చేస్తున్నారు. ఈ సాయంత్రమే అమరావతిలో తన సర్వే అప్ డేట్స్ చెప్తారట.. మే 19న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. లగడపాటి మాత్రం ఒకరోజు ముందే సర్వేతో వస్తున్నారు.

డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో  కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుస్తుందని.. టీఆర్ఎస్ ఓడిపోతుందని లగడపాటి తన సర్వేలో బయటపెట్టాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లగడపాటిని నమ్మి లక్షలు పందాలు కాశారు. వారంతా నిండా మునిగారు. ఈ సాయంత్రం కూడా లగడపాటి ఏపీ ఫలితాలను విశ్లేషించేందుకు వస్తున్నారు. అయితే లగడపాటిని నమ్మి కోట్లు బెట్టింగ్ లు కాసే ధైర్యం మాత్రం ఈసారి బెట్టింగ్ రాయుళ్లు చేయడం లేదు.. అయితే ఈసారి నాలుగు దఫాలుగా సర్వే చేయించి లెక్కతేల్చానని లగడపాటి చెప్తున్నాడట.. దీంతో ట్రాక్ రికార్డు చూస్తే (ఒక్క తెలంగాణ ఫలితం తప్ప) లగడపాటి జోస్యం అన్ని ఎన్నికల్లోనూ దాదాపు నిజమైంది. దీంతో లగడపాటిని నమ్మి బెట్టింగ్ కాయాలా.? వద్దా అనే మీమాంసలో బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారు.

ఏపీలో బెట్టింగ్ లు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై కోట్లాది రూపాయలు బెట్టింగ్ లు కాస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన అమరావతి , విజయవాడ సహా ఏపీ కీలక పట్టణాల్లో బెట్టింగ్ నిర్వాహకులు మకాం వేశారు. గండరగండరలు పోటీచేసిన నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ కాస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గెలుపు ఓటమిపై.. ఇక పరిటాల శ్రీరామ్, దేవినేని అవినాష్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ రావుల గెలుపు ఓటములతోపాటు చంద్రబాబు, జగన్ ల మెజార్టీలపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్ గా ఏపీలో అధికారం టీడీపీదా..? వైసీపీదా అనే దానిపై ఎక్కువ పందాలు కాస్తున్నారు.

2014లో గెలిచిన టీడీపీకి, ఓడిన వైసీపీకి మధ్య కేవలం 2శాతం మాత్రమే ఓట్ల తేడా ఉంది. జనసేన, బీజేపీలు టీడీపీకి సపోర్ట్ చేయడంతో గెలవాల్సిన వైసీపీ ఓడిపోయింది. ఈసారి జనసేన ఒంటరిగా పోటీచేసింది. తనతోపాటు దళితుల ఓట్లు చీల్చేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన ఓట్లు ఎంత చీల్చిందనేదే ఈ ఎన్నికల్లో కీలకం. అయితే ఈసారి ఏపీలో వైసీపీ గాలి వీచిందని.. జగన్ గెలుస్తారని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇలా రకరకాల అంచనాల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పందాలు కాయడం ఈసారి కత్తిమీద సాములా మారింది. అంతుచిక్కని ఏపీ ఓటరు నాడితో పందాలు కాయడానికి తటపటాయిస్తున్నారు. లగడపాటి సర్వే ఫలితాల తర్వాత విశ్లేషించుకొని బెట్టింగ్ రాయుళ్లకు నమ్మకం కుదిరితే పందాల జోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News