పాత‌బ‌స్తీలో హైటెన్ష‌న్.. ఇద్ద‌రు హిజ్రాలు మృతి

Update: 2018-05-27 05:48 GMT
కోట్లాది మంది ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేయ‌టంలో మీడియాను మించిపోయేలా ప్ర‌భావం చూపిస్తోంది సోష‌ల్ మీడియా. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా ఒక‌టి సంచ‌రిస్తున్న‌ట్లుగా గ‌డిచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ‌దంతులు షేర్ అవుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో త‌మ‌కు అందిన వీడియోల‌ను.. స‌మాచారాన్ని ఎడాపెడా షేర్ చేస్తున్న తీరుతో.. ఇప్పుడు అనుక్ష‌ణం భ‌యం భ‌యంతో వ‌ణికిపోయే ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో.. త‌మ‌ను ఇంతగా భ‌య‌పెడుతున్న దానిపై రెండు రాష్ట్రాల్లోని ప‌లు గ్రామాల‌లో ప్ర‌జ‌లు కొత్త వారిపై వెనుకా ముందు చూసుకోకుండా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా అలాంటి వైనం హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో చోటు చేసుకుంది.

శ‌నివారం రాత్రి ప‌దిన్న‌ర గంటల స‌మ‌యంలో అనుమానితుల‌పై దాడి జ‌రిగింది. పిల్ల‌ల్ని ఎత్తుకెళ్తున్నార‌న్న నెపంతో పాత‌బ‌స్తీకి చెందిన స్థానికులు ముగ్గురు హిజ్రాల‌పై రాళ్ల‌తో దాడి చేశారు. దీనిపై స‌మాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు. వారిపైనా స్థానికులు దాడికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. సంచ‌లంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. చంద్రాయ‌ణ‌గుట్ట‌లో శ‌నివారం రాత్రిపూట కొంద‌రు హిజ్రాలు అనుమానాస్ప‌దంగా సంచరించార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

అంతే.. నిమిషాల వ్య‌వ‌ధిలో దాదాపు మూడు వేల మందికి పైగా ప్ర‌జ‌లు ఒక చోట‌కు చేరారు. అనుమానాలు వ్య‌క్త‌మైన హిజ్రాల మీద పెద్ద పెద్ద రాళ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న‌పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని స్థానికుల్ని శాంతింప‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ప‌రిస్థితి అదుపులోకి రాలేదు. ఒక‌ద‌శ‌లో పోలీసుల పెట్రోలింగ్ వాహ‌నాల అద్దాల‌ను ధ్వంసం చేశారు. ప‌రిస్థితిని అదుపు చేయ‌టానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వ‌చ్చింది.

ఇక‌.. ప్ర‌జ‌ల సామూహిక దాడిలో గాయ‌ప‌డిన ముగ్గురు హిజ్రాల్లో ఒక‌రు ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు. మ‌రో ముగ్గురిని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. స్థానికంగా ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News