కేసీఆర్‌లో ఇంత మార్పా?

Update: 2021-05-20 12:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కొనసాగుతున్న టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులో నిజంగానే ఇప్పుడు పెద్ద మార్పే క‌నిపిస్తోంది. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో త‌న‌దైన శైలిలో జ‌నం మ‌ధ్య‌నే గ‌డిపిన కేసీఆర్‌... తెలంగాణ క‌ల సాకారం కావ‌డం, వెంట‌నే జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రానికి తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయింది. సీఎం ప‌ద‌వి ద‌క్క‌గానే... జ‌నాల్లోకి వెళ్లే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసిన కేసీఆర్‌... ఎంత‌సేపూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే, లేదంటే ఎర‌వ‌లిలోని త‌న ఫాం హౌజ్ లోనే కాల‌క్షేపం చేసేశారు. క‌నీసం సెక్ర‌టేరియ‌ట్ ముఖం కూడా చూడ‌కుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే పాలన సాగిస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌నూ కేసీఆర్ ఎదుర్కొన్నారు. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇప్ప‌టికి ఏడేళ్లు గ‌డుస్తున్నా కూడా కేసీఆర్ వైఖ‌రిలో ఎలాంటి మార్పు కూడా రాలేద‌నే చెప్పాలి.

అయితే ఎందుక‌నో గానీ... కేసీఆర్ లో పెద్ద మార్పే క‌నిపించింది. అది కూడా ఒక్క‌సారిగా క‌నిపించ‌డంతో జ‌నంతో పాటు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కూడా షాక్ తిన్నార‌నే చెప్పాలి. గ‌డ‌ప దాట‌కుండా పాల‌న సాగిస్తున్న సీఎంను కేసీఆర్ నే చూస్తున్నామంటూ నిన్న‌టిదాకా విమ‌ర్శ‌లు సంధించిన కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన నేత‌లు... ఇప్పుడు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేసీఆర్ క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా షాక్ తిన్నార‌నే చెప్పాలి. బుధ‌వారం గాంధీ ఆస్ప‌త్రి సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన కేసీఆర్‌... ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌తో ముచ్చ‌టించారు. వారికి మ‌నోధైర్యం చెప్పారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా వైద్య సేవ‌లు సాగిస్తున్న వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. మ‌రింత మేర సేవ‌లు చేయండ‌ని, అండ‌గా తానుంటాన‌ని కూడా కేసీఆర్ వారికి భ‌రోసా ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రిలోని వివిధ విభాగాల‌ను త‌నిఖీ చేసిన కేసీఆర్‌... ఆస్ప‌త్రిలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నులపై దృష్టి సారించారు. ఇక గురువారం నాడు వ‌రంగ‌ల్ లోని ఎంజీఎం ఆస్ప‌త్రి సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌నున్న‌ట్లుగా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

గ‌తంలో అయితే... ఏదో కేబినెట్ మీటింగులో, అసెంబ్లీ స‌మావేశాల్లో మాత్ర‌మే కేసీఆర్ క‌నిపించేవారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే క‌నిపించేవారు. మిగిలిన స‌మ‌యం మొత్తం ఆయ‌న తెర వెనుకే ఉండిపోయారు. ఇక సీఎం హోదాలో ఉన్నా ఏ శాఖలో ఏ ప్రాధాన్య‌తాంశం ఉన్నా... ఏ స‌మ‌స్య ఉన్నా స‌ద‌రు శాఖా మంత్రినే పుర‌మాయించే కేసీఆర్‌... తాను మాత్రం కాలు బ‌య‌ట‌పెట్టేవారు కాదు. మ‌రి అలాంటి కేసీఆర్‌.. ఇప్పుడు ఉన్న‌ప‌ళంగా... అది కూడా ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ త‌న‌దైన శైలి ఉధృతి చూపిస్తున్న వేళ... పీపీఈ కిట్ లేకుండా... కేవ‌లం ముఖానికి మాస్క్ తో మాత్ర‌మే గాంధీ ఆస్ప‌త్రికి వెళ్ల‌డం, అది కూడా క‌రోనా బాధితుల‌తో మాట్లాడ‌టం చూస్తుంటే... కేసీఆర్ లో భారీ మార్పే క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఈ మార్పు వెనుక కేసీఆర్ వ్యూహ‌మేమిట‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ప్ర‌త్య‌ర్థుల‌కు మాత్రం చేతి నిండా ప‌ని దొరికిన‌ట్టేన‌ని చెప్పాలి.





Tags:    

Similar News