డ్రోన్లను కూల్చే సత్తా మనకెంత ఉంది? ఆ ప్రముఖుడు ఏం చెప్పారు?

Update: 2021-07-05 02:34 GMT
దాయాది దేశం నుంచి ఇంతకాలం ఉగ్రముప్పును ఎదుర్కొంటున్న భారత్ కు.. ఇటీవల వచ్చి పడిన డ్రోన్ల దాడులు కొత్త సవాలును విసిరాయి. జమ్ములోని ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరెంత సమస్యగా మారుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. జమ్ము ఎపిసోడ్ తర్వాత కూడా మన భూభాగంలో డ్రోన్లు చక్కర్లు కొట్టటం.. వాటి మీద మన సైనికులు కాల్పులు జరపటం తెలిసిందే. ప్రత్యర్థులు ప్రయోగించే డ్రోన్ల మీద కాల్పులు జరిపే బదులు.. మన సరిహద్దుల్లోకి అడుగు పెట్టినంతనే పేల్చేలా ఎందుకు చేయలేకపోతున్నామన్న సందేహం కొందరిలో కలుగుతోంది.

ఇంతకీ భారత్ కు డ్రోన్లను నిలువరించే సామర్థ్యం ఎంత ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. రానున్న రోజుల్లో డ్రోన్లతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో మన సత్తా ఎంతన్న విషయాన్ని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు డీఆర్ డీవో చీఫ్ గా వ్యవహరిస్తున్న సతీశ్ రెడ్డి. తెలుగువాడైన ఆయన చెప్పిన కీలక అంశాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘డ్రోన్లను కూల్చే అత్యాధునిక డ్రోన్ వ్యవస్థను డీఆర్ డీవో సక్సెస్ ఫుల్ గా డెవలప్ చేసింది. చిన్న మైక్రో డ్రోన్లను సైతం రాడార్ తో గుర్తించే సమగ్ర వ్యవస్థను ఇందులో డెవలప్ చేశాం. ఎలక్ట్రో-ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ సెన్సర్ల ఆధారంగా గుర్తించి శత్రువుల డ్రోన్లను ట్రాక్ చేస్తుంది. సాఫ్ట్ కిల్ వ్యవస్థతో రేడియో ఫ్రీక్వెన్సీ.. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నళ్లను స్తంభింపజేస్తుంది. డీఆర్ డీవో డెవలప్ చేసిన హార్డ్ కిల్ వ్యవస్థ లేజర్ టెక్నాలజీతో డ్రోన్లను నిర్వీర్యం చేసే సత్తా ఉంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానించుకొని ఉంటాయి’’ అని చెప్పారు. డీఆర్డీవో రూపొందించిన యాంటీ డ్రోన్ సిస్టంలో వివిధ రేంజ్ లలో శత్రువుల డ్రోన్లను నిలువరించే సత్తా ఉందని ఆయన చెబుతున్నారు.

360 డిగ్రీల కోణంలో టార్గెట్లను గుర్తించే వ్యవస్థ తాము డెవలప్ చేసిన రాడార్ వ్యవస్థలో ఉందని.. నాలుగు కిలోమీటర్లు వరకు మైక్రో డ్రోన్లను గుర్తించగలదని పేర్రకొన్నారు. ఇన్ ప్రారెడ్ తో ఎంపిక చేసిన దిశలో రెండు కిలోమీటర్ల మేర చిన్న.. సూక్ష్మ డ్రోన్లను గుర్తించే శక్తి ఈ టెక్నాలజీ సొంతమని ఆయన చెబుతున్నారు. సాఫ్ట్ కిల్ టెక్నాలజీతో మూడు కిలోమీటర్ల పరిధిని లక్ష్యంగా చేసుకొని సిగ్నల్స్ ను జామ్ చేయొచ్చని చెప్పారు. ఫైబర్ లేజర్ తో టార్గెట్ ను గుర్తించి ధ్వంసం చేస్తుందని.. 150 మీటర్లు నుంచి ఒక కిలోమీటర్ వరకు ఇది పని చేస్తుందని సతీశ్ రెడ్డి వెల్లడించారు.

డీఆర్డీవో రూపొందించిన ఈ సాంకేతితను యువ శాస్త్రవేత్తలు డెవలప్ చేశారని.. ఈ టెక్నాలజీని రక్షణ శాఖకు చెందిన భెల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)కు అందజేశామని.. భారత సాయుధ దళాలు వారికి ఆర్డర్లు ఇవ్వొచ్చన్నారు. మరి.. ఇలాంటి టెక్నాలజీని సొంతంగా కలిగి ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని భారత్ దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనలో ఉందన్న వార్తలపైనా ఆయన స్పందించారు.

ఇజ్రాయెల్ టెక్నాలజీతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామన్న కీలక ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తాము డెవలప్ చేసిన టెక్నాలజీ ఇతర దేశాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుందని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే.. పరిస్థితులకు తగ్గట్లుగా ఆయుధ వ్యవస్థలను డెవలప్ చేసుకోలేమన్న ఆయన మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా ఎందుకు వెతుకుతున్నాం? ఉన్న టెక్నాలజీని మరింతగా డెవలప్ చేయాలని చెప్పాలే కానీ.. విదేశీ మోజులో ఎందుకు ఉంటున్నట్లు? అన్న సందేహాలు మదిలో మెదలకు మానవు.
Tags:    

Similar News