చందమామ వయసును తాజాగా కనుగొన్నారు

Update: 2019-07-31 06:07 GMT
పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు.. క్విజ్ పోటీలకు వెళ్లే వారంతా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకూ పుస్తకాల్లో పేర్కొన్నట్లుగా చందమామ వయసుకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని తాజాగా గుర్తించారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ చందమామ పుట్టిన వయసుపై మానవాళిలో ప్రచారంలో ఉన్న సమాచారం అంతా తప్పన్న విషయం తేలింది. సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత సుమారు 5 కోట్ల ఏళ్ల తర్వాత చంద్రుడు పుట్టినట్లుగా శాస్త్రవేవ్తలు గుర్తించారు.

అయితే..ఇప్పటివరకూ ఉన్న అంచనా ప్రకారం సౌరవ్యవస్థ ఏర్పడిన సుమారు 15 కోట్ల ఏళ్ల తర్వాత చందమామ పుట్టినట్లుగా పేర్కొనే వారు. దాని కంటే పది కోట్ల సంవత్సరాల ముందే చందమామ పుట్టిన వైనాన్ని గుర్తించారు. తాజాగా జర్మనీలోని కొలోన్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో చందమామ వయసు మీద కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

తాజా పరిశోధనల నేపథ్యంలో సౌర వ్యవస్థ 456 కోట్ల ఏళ్ల కిందట సౌర వ్యవస్థ ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. సౌర వ్యవస్థ ఏర్పడిన 5 కోట్ల ఏళ్లకు చంద్రుడు ఉనికిలోకి వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. 1969 జులై 21న తొలిసారి చంద్రుడిపైకి అపోలో 11 మిషన్ ద్వారా మనిషి అడుగుపెట్టాడు. అక్కడ గడిపిన కొన్ని గంటల్లోనే వారు దాదాపు 21.55 కేజీల మట్టిని భూమి మీదకు తీసుకొచ్చారు.

అప్పటినుంచి ఈ మట్టిపై పరిశోధనలు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు విశ్లేషణల అనంతరం చందమామ పుట్టుక వివరాల్ని గుర్తించారు. ఈ పరిశోధన ద్వారా భూమి ఎప్పుడు పుట్టిందనే విషయం మీద అవగాహన మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. సో.. చందమామ మనం అనుకున్నంత చిన్నోడు కాదు.. బాగా పెద్దోడే సుమి.


Tags:    

Similar News