సర్టిఫికేట్ల మీద ఫోటోతో మోడీ ఇమేజ్ కు భారీ డ్యామేజ్

Update: 2021-05-27 06:30 GMT
ఏడాది క్రితం.. ఆ మాటకు వస్తే ఆర్నెల్ల క్రితం కూడా ప్రధాని మోడీపై సరైన ఆరోపణలు.. విమర్శలు చేసే దమ్ము.. ధైర్యం లేని పరిస్థితి. ఆయనపై ఈగ వాలినా.. ఒప్పుకోకుండా ఆయన తరఫున మాట్లాడటానికి.. వాదనలు వినిపించటానికి కోట్లాది మంది సిద్దంగా ఉండేవారు. ఆయనకున్న ఇమేజ్ తో సమీప భవిష్యత్తులో ఆయన్ను ఢీ కొట్టే వారెవరూ ఉండరన్న వాదన వినిపించేది. అలాంటి మోడీకి ఇప్పుడున్న పరిస్థితి గురించి అందరికి తెలిసిందే.

సెకండ్ వేవ్ సందర్భంగా కేంద్రం వ్యవహరించిన తీరు.. దేశంలో నెలకొన్న పరిస్థితులకు ప్రధాని చేసిన పొరపాట్లే దేశ ప్రజలకు శాపంగా మారాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు.. వ్యాక్సినేషన్ మీద ఆయన విజన్ పై పెద్ద ఎత్తున తప్పులు ఎత్తి చూపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొవిడ్ టీకా వేయించుకున్న వారికి ఇచ్చే సర్టిఫికేట్లలో ప్రధాని మోడీ ఫోటో వేయటంపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

టీకా మీద మోడీ ఫోటో వేయించుకోవటం తప్పేం కాదు. కానీ.. కొవిడ్ కారణంగా మరణించిన కుటుంబాలకు ఇచ్చే డెత్ సర్టిఫికేట్ మీద కూడా మోడీ ఫోటో వేయాలన్న డిమాండ్ కు ఇప్పుడు సర్వత్రా మద్దతు లభిస్తోంది. వ్యాక్సిన్ తో ఇమేజ్ పెంచుకోవటానికి ఏ ఫోటోను అస్త్రంగా వాడాలని డిసైడ్ అయ్యారో.. ఇప్పుడు అదే ఫోటో కరోనా మరణాల వేళ.. కొత్త ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది. నిజానికి ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ కు.. టీకా సర్టిఫికేట్ల మీద ప్రత్యేకంగా ఆయన ఫోటో అవసరమే లేదు.

జాతీయ కార్యక్రమానికి భారత దేశ ప్రభుత్వ రాజముద్ర ఒక్కటి సరిపోతుంది. నిజానికి అదే హుందాగా ఉంటుంది కూడా. కానీ.. కోట్లాది మందికి చేసే వ్యాక్సినేషన్ తో.. తన ఫోటోను దేశంలోని మెజార్టీ కుటుంబాల్లో ఉండేలా చూసుకోవాలన్న ప్రధాని తపన.. ఈ రోజున కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. ఆయన ఇమేజ్ ను పాతాళానికి పడిపోయేలా చేసిందని చెప్పాలి. వ్యాక్సిన్ కు ఫోటో ఓకే.. కాకుంటే డెత్ సర్టిఫికేట్ మీద కూడా అన్న మాట కమలనాథుల గొంతులకు అడ్డుగా మారింది. ఒక్క ఫోటో అంత పెద్ద మోడీకి ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టింది?
Tags:    

Similar News