ఎన్నికల వేళ.. బౌన్సర్ల హేల!

Update: 2018-11-16 10:06 GMT
సెలబ్రిటీలు పాల్గొనే ఏ కార్యక్రమమైనా ప్రధానంగా కనిపించేవారు బౌన్సర్లు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ నేతలు కూడా రక్షణగా నియమించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  పబ్ లు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో  ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తుంటారు.. కానీ, పార్టీ ఆఫీసులు - ప్రచారాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరికి చేసే ఖర్చు కూడా కాస్తా ఎక్కువగానే ఉంటుంది.

నల్లని డ్రెస్సులో కండలు తిరిగిన దేహధారుడ్యంతో  ఉండే బౌన్సర్లను పార్టీ ఆఫీసుల వద్ద మోహరించడానికో కారణం ఉంది.  అన్ని పార్టీల్లో పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అసంతృప్తులు గొడవలు సృష్టించి కార్యాలయ ఆస్తులు ధ్వంసం చేస్తారేమోనని పార్టీల అధినేతలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా గాంధీ భవన్ వద్ద బౌన్సర్లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 18 మందికి పైగానే వివిధ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మరోవైపు పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. అలాగే,  బంజారాహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఇంటి దగ్గర కూడా   బౌన్సర్ల హడావిడి ఎక్కువగానే ఉందట.  ఆయన ఇంటిపై అసంతృప్తులు  దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు   హెచ్చరించాయట. దీంతో భారీగా బౌన్సర్లతో పాటు పోలీసులను సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకున్నారు. 

ఇంత వరకు బాగానే ఉన్నా, బౌన్సర్లకు రోజువారీ ఖర్చు చిరిగి చాటవుతుందట. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సాయంతో నియమించుకుంటున్న వీరికి రోజు రూ.1000పైగానే చెల్లిస్తున్నారు. ఇంకా భోజనం - ఇతర సదుపాయాలు అదనం. ఆ లెక్కన రోజుకు రూ.1లక్షపైనే ఖర్చువుతుందట. ఈ మొత్తాన్ని పార్టీ ఫండ్ నుంచి చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. 

అయితే, బౌన్సర్ల నియామకంపై ఆయా పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని తరచి తరచి చూస్తుండటంతో, ఈ గోల ఏంటని  మండిపడుతున్నారు. అసలు కార్యాలయంలోకి రావద్దంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే,  ఎన్నికల ప్రచారంలో కూడా   కొందరు అభ్యర్థులు  బౌన్సర్లను  వాడేస్తున్నారు. పైగా హుందాగా కనిపిస్తుండటంతో - వీఐపీలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బౌన్సర్లకు కొరత ఏర్పడటంతో - జిమ్ముల్లో కండలు పెంచుతున్న యువతకు అవకాశాలు పెరిగాయి. రోజుకు వెయ్యిపైగానే ఇస్తుండటంతో వారు నల్లని డ్రెస్సులు వేసుకొని వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అలా, ఎన్నికలు బౌన్సర్లతో పాటు యువతకు ఉపాధి తెచ్చిపెట్టాయన్న మాట.


Tags:    

Similar News