ఆశావహులకు కేసీఆర్ పై ఎంత నమ్మకమో!

Update: 2018-02-28 13:44 GMT
తెలంగాణకు కూడా ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు దక్కబోతున్నాయి. ఈ మూడింటిని భర్తీ చేయడం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న సంకేతం ఇచ్చారు. అంతే తెరాస ఆశావహుల్లో తొక్కిడి మొదలైంది. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రభావితం చేయగల స్థాయి ఉన్న నాయకుల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. పదవులు ఆశించే వాళ్లంతా డైరక్టుగా కేసీఆర్ వద్ద యాక్సెస్ తమకు లేకపోతే గనుక.. మంత్రులు కేటీఆర్ - హరీష్ రావు - అలాగే ఎంపీ కవిత చుట్టూ తిరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇంతకూ కేసీఆర్ ఏం చెప్పారు? ఏం హామీ ఇచ్చారు? రాజ్యసభ స్థానాలను ఎలా భర్తీ చేస్తానని అన్నారు? ఈ సందేహం రావడం సహజం. ఆయన అన్ని మతాలు - కులాల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తానని కేసీఆర్ వెల్లడించారు. గొల్లకురుమలు - ఎస్సీ - ఎస్టీ - మైనారిటీ - బీసీ - రెడ్డి లకు  కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. ఇందులో ఆయన వదిలిపెట్టింది ఎవరిని? దాదాపుగా అన్ని కులాలను కలగలిపినట్లే కేసీఆర్ ప్రకటించారు. అయితే యాదవ వర్గానికి చెందిన ఖచ్చితంగా తమకు అవకాశం దక్కుతుందనే ఉద్దేశంతో నాయకుల చుట్టూ బీభత్సంగా తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గొల్ల కురుమల్లో రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారుట. వారంతా పైన చెప్పుకున్న పార్టీ ప్రముఖులతో పాటు తలసాని శ్రీనివాసయాదవ్ చుట్టూ కూడా తిరుగుతున్నారు.
 
టిక్కెట్ అంత ఈజీయేం కాదు..

ఆశావహులకు ఇలాంటివన్నీ కనిపించవు వినిపించవు గానీ.. ఇంతకూ తెరాసకు దక్కనున్న ఎంపీ సీట్లు ఎన్ని? ఆయన హామీ ఇచ్చింది ఎన్నికులాలు మతాలకు? దక్కేది కేవలం మూడు. ఆయనేమో గొల్ల కురుమలు - ఎస్సీ - ఎస్టీ - బీసీ - (ఇందులో మళ్లీ ఎన్ని కులాలుంటాయో లెక్కేలేదు) మైనారిటీ - రెడ్డి అని వెల్లడించారు. ఆయన ప్రకటించకపోయినప్పటికీ.. వెలమలకు కూడా అందులో ఒక రిజర్వుడు సీటు ఉంటుందని అనుకోవచ్చు. ఇక ఈ లెక్కన ఆ కులాలన్నిటిలో ఎవరికేం దక్కుతుందనేది డౌటే.

ప్రకటించకపోయినా సరే.. కేసీఆర్ మేనల్లుడు - ప్రస్తుతం టీన్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు ఒక టికెట్ ఖరారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడ్డి వర్గం అని కేసీఆర్ నోటినుంచి వచ్చింది గనుక.. బాగా సీనియర్ అయిన నాయని నర్సింహారెడ్డిని గానీ - పార్టీలోకి వచ్చి ఆబ్లిగేషన్ ఉన్న ఉమా మాధవరెడ్డిని గానీ ఎంపిక చేయవచ్చు. ఇక మిగిలి ఉన్న ఒక్కసీటు కోసం సకలకులాలూ కొట్టుకోవాల్సిందే. అని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News