తమిళనాడులో ఆ రెండు గంటల్లో ఏం జరిగింది..?

Update: 2016-05-20 11:30 GMT
తమిళనాడు ఎన్నికల్లో ఉచిత హామీలు చూపించే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు నిరూపణ అయింది. తమిళనాడులోని ఏ ఇంట్లో చూసినా కరుణానిధి ఇచ్చిన కలర్ టీవీలు - జయలలిత ఇచ్చిన మిక్సీలు, గ్రైండర్లు, విద్యార్థుల చేతిలో ల్యాప్ టాప్ లు కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇస్త్రీ పెట్టెలు - ఆవులు వంటివి కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇచ్చాయి. అందుకే అక్కడ ఉచిత హామీలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. గత ఎన్నికల్లో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఉచితంగా ఇస్తానని ప్రకటించి ఆ దెబ్బకు మంచి విజయం అందుకున్న జయలలిత ఈసారి కూడా అలాంటిదే అద్భుతమైన హామీ ఇంకొకటి ఇచ్చారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లకు స్కూటర్లు(యాక్టివాలు - స్కూటీలు వంటివి) సగం ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు.  అది ఈసారి బాగా వర్కవుట్ అయింది.

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి జయ విజయం సాధించడం కష్టమేనని ఎగ్జిట్ పోల్సు అంచనా వేశాయి. పోలింగ్ సరళి కూడా ముందంతే అదే నిజమవుతుందన్నట్లుగా కనిపించింది. కానీ.. ఫలితాల రోజు చూస్తే అందరి అంచనాలు తారుమారయ్యాయి. జయ మళ్లీ అధికారం అందుకుంది. అందుకు కారణమేంటనేది జనం ఇప్పడు చర్చించుకుంటున్నారు. జయ ఆఫ్ రేట్ స్కూటర్ల హామీలకు మహిళలు ఫ్లాటయిపోయారని చెబుతున్నారు. పోలింగ్ రోజున రోజంతా ఒకెత్తయితే... చివరి రెండు గంటల్లో జరిగిన పోలింగ్ ఇంకో ఎత్తని.. అదే జయకు విజయం సాధించి పెట్టిందని చెబుతున్నారు.

తమిళనాడు పోలింగ్ కు వర్షం కొంత అంతరాయం కలిగించడంతో సమయం పెంచారు. మరోవైపు ఆఫీసు వేళలు ముగియడానికి కొద్ది గంటల ముందు నుంచే మహిళా ఉద్యోగులు పోలింగు కేంద్రాలకు రావడం ప్రారంభించారు. ఇంకొందరు సాయంత్రం  4 - 5 గంటలు ఆఫీసులు ముగియగానే నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయారు. అలా చివరి రెండు గంటల్లో మహిళల ఓటింగ్ విపరీతంగా పడింది. వారంతా హాఫ్ రేట్ స్కూటర్ల హామీ ప్రభావానికి లోనయినవారే. దాంతో ఓడిపోతుందనుకున్న జయ రికార్డు సృస్టిస్తూ రెండోసారి గెలిచింది.
Tags:    

Similar News