మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరిగేనా?

Update: 2021-07-31 06:31 GMT
తెలంగాణ శాసనమండలి లో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ఓ చర్చ అయితే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇంతకు ముందే ఓసారి వాయిదా పడిన ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక వాయిదా పడితే , ఇటీవలే మాజీ మంత్రి ఈటల రాజీనామా తో ఖాళీ అయిన హుజూరాబాద్‌ శాసనసభ స్థానం కి జరిగే ఉప ఎన్నిక కూడా ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 3వ తేదీనే ముగిసిపోయింది. వాస్తవానికి వారి పదవీకాలం ముగియ డానికి నెల ముందే ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. కానీ, కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్తనాలకి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తు తం వాటి నిర్వహణపై దృష్టిపెట్టిన ఈసీ , రాష్ట్రంలో కరోనా స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలపాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి సమాధానంగా ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఇకపోతే , రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌, గత నెల 12న ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేశారు. ఈ మేరకు హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. టీఆర్‌ ఎస్‌ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఇప్పటికే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టేశారు. మరోవైపు టీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల నిబంధ నల ప్రకారం  ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాలి. అంటే హుజూరా బాద్‌లో డిసెంబర్‌ 12 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. కాబట్టి ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరిస్థితులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై విముఖత వ్యక్తం చేయడంతో, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన అయితే వెలువడాల్సింది ఉంది.
Tags:    

Similar News