కొత్త 200 - 50 నోట్లు హైద‌రాబాద్‌ కు రావా బాస్‌?

Update: 2017-09-01 13:49 GMT
మెట్రో న‌గ‌రాల్లో పాపుల‌ర్ అయిన హైద‌రాబాద్‌ కు మిగ‌తా న‌గ‌రాల‌తో పోలిస్తే ఒక కొత్త తృప్తి దూర‌మ‌యింద‌ని అంటున్నారు. ఆగ‌స్ట్ 25 న కొత్త 200 నోటును ఆర్బీఐ ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. దాంతో పాటు కొత్త 50 నోటును కూడా దేశ‌వ్యాప్తంగా చెలామ‌ణిలోకి తీసుకొచ్చింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త 200 - 50 నోట్లు హైద‌రాబాద్ కు చేర‌లేదు. ఇంత వ‌ర‌కు హైద‌రాబాదీయులు కొత్త నోటును చూసిందే లేదు. దేశవ్యాప్తంగా కొత్త నోట్ల‌ను చెలామ‌ణిలోకి తీసుకొచ్చిన ఆర్బీఐ ముందుగా న్యూఢిల్లీ - ముంబై - కోల్‌ క‌తా లాంటి మెట్రో సిటీల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత మిగితా రాష్ట్రాలకు కొత్త నోట్లు వెళ్తాయ‌ని వెల్ల‌డించింది. కానీ హైద‌రాబాదీల‌కు మాత్రం ఈ సంతోషం ఇంకా ద‌క్క‌లేదు.

అయితే.. హైద‌రాబాద్ లోని ఆర్బీఐ కార్యాల‌యంలో కొత్త నోట్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ.. న‌గ‌రంలోని బ్యాంకుల‌కు మాత్రం ఇంకా కొత్త నోట్లు చేర‌లేదు. అయితే.. క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల్లో కొత్త నోట్లు తీసుకోవాల‌నుకునే వాళ్లు మాత్రం ఇంకో వారం ఆగాల్సిందేన‌ని రాష్ట్ర బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎంఎస్ కుమార్ చెబుతున్నారు. ఇక‌.. న‌గ‌రంలో ఉన్న 1500 ఏటీఎంల‌లో నుంచి కొత్త నోట్ల‌ను పొందాలంటే మాత్రం ఇంకో మూడు నెల‌లు వేచి చూడాల్సిందేన‌ని కుమార్ అంటున్నారు. ఇదివ‌ర‌కు న‌వంబ‌ర్ లో పెద్ద నోట్లు 500 - 1000 బ్యాన్ చేసిన త‌ర్వాత వ‌చ్చిన కొత్త 500 - 2000 నోట్లను ఏటీఎంల‌లో అమ‌ర్చ‌డానికి క‌నీసం రెండున్న‌ర నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని.. మ‌ళ్లీ ఈ కొత్త 200 - 50 నోట్ల‌ను వాటి కొల‌త‌లు - వాల్యూ ప్ర‌కారం ఏటీఎంల‌లో అమ‌ర్చ‌డానికి ఓ మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

అయితే.. ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా ఉంది. అప్పుడు కొత్త నోట్ల కోసం ఏటీఎం లలో మార్పులు చేసిన కొన్ని ఏజెన్సీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పేమెంట్ అంద‌లేద‌ట‌. కొన్ని ఏటీఎంలు కొత్త నోట్ల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌ట్లేద‌ట‌. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే.. ఇప్పుడు వ‌చ్చిన కొత్త 200 - 50 నోట్లు ఏటీఎంల‌లో రావ‌డానికి ఎన్ని నెల‌లు ప‌డుతుందో మ‌నమే అర్ధం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News