నిరూపిస్తే చెవి కోసుకుంటా.. : హైదరాబాద్ మేయర్

Update: 2021-12-16 11:30 GMT
గెలిచి ఏడాదైనా.. ఇంతవరకు సొంత ముద్ర లేదు.. కనీసం తను మేయర్ అని చాలామందికి గుర్తు కూడా లేదు. కరోనా కారణమో.. రాజకీయంగా ఇబ్బందో కానీ.. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తనదైన మార్క్ చూపలేకపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కె.కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు. అయితే, మేయర్ గా పాలనలో మాత్రం ఆమె వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు.

అంతకుముందు.. ఆ తర్వాత

గత మేయర్ బొంతు రామ్మోహన్ చురుగ్గా కనిపించేవారు. పార్టీ , ప్రభుత్వంలో ఆయనకున్న పట్టు కావచ్చు.. కౌన్సిల్ లో భారీ ఆధిక్యం ఉండడం కావచ్చు.. రామ్మోహన్ క్రియాశీలంగా కనిపించేవారు. అయితే,విజయలక్ష్మికి అలాంటి పరిస్థితి లేదు. అరకొర మెజార్టీతో పార్టీ అధికారంలోకి వచ్చింది. మేయర్ పీఠమైతే దక్కింది కానీ.. కౌన్సిల్ లో బీజేపీ బలంగా ఉంది.

దీనికితోడు కరోనాతో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. ఇటీవల కౌన్సిల్ లో చోటుచేసుకున్న రగడ రాజకీయ వివాదానికి కూడా దారితీసింది. మరోవైపు మేయర్ తాము కలుసుకునేందుకు సమయం ఇవ్వడం లేదని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే, దీనిపై విజయలక్ష్మి గట్టిగానే స్పందించారు.

బీజేపీ కార్పొరేటర్లను తాను కలవడం లేదన్నది అవాస్తవమని, అది నిరూపిస్తే చెవి కోసుకుంటానని అన్నారు. కార్పొరేటర్లందరికీ తాను అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత నెలలో.. మేయర్‌ ఛాంబర్‌ను బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించగా, ఆమె ఇలా స్పందించారు.

కార్పొరేటర్లకు అందుబాటులో ఉండడం లేదని ప్రచారం చేస్తున్నారని, అందుకే జోన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అధికారులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తున్నానని, శనివారం జరగబోయే కౌన్సిల్‌ సమావేశాన్ని మీరే చూస్తారన్నారు.


Tags:    

Similar News