1947 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర్యం.. కానీ నిజాంల హైదరాబాద్ లో ఇదీ పరిస్థితి!

Update: 2022-08-15 09:30 GMT
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ప్రతీ సంవతర్సం ఆగస్టు 15న సంబరాలు చేసుకుంటాం.. జాతీయ జెండాను ఎగురవేసి.. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. 1947లో ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. కానీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఎటువంటి హడావుడి కనిపించలేదు. కనీసం జెండా ఎగురవేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్ నగరం మొత్తం ఇళ్లల్లోనే ఉండి రేడియో ప్రసంగం వింటూ గడిపింది. ఇలా జరగడానికి కారణమేంటి..? ఎందుకు ఇక్కడ వేడుకలు నిర్వహించలేదు...?

వందల సంవత్సరాలు భారత్ దేశం.. బ్రిటిష్ కబంద హస్తాల్లో చిక్కిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వానికి కొందరు రాజులు తమ అవసరానికంటే ఎక్కువగా మద్దుతు ఇచ్చి తమ భూభాగాలను కాపాడుకునేవారు. ఇలాగే నిజాం ప్రభుత్వం కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత నమ్మకంగా ఉండేది. ఈ తరుణంలో దేశాన్ని బ్రిటిష్ పాలకులు విడిచిపెట్టిన సమయంలో నిజాం ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకులను నిషేధించింది. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చిన రోజు శుక్రవారం కావడం ఒక కారణమైంది. నిజాం ప్రభుత్వ కాలంలో శుక్రవారం సెలవుదినం. అందుకే ఆరోజు ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు తెరుచుకోలేదు. ఫలితంగా ఎక్కడా హడావుడి కనిపించలేదు.

అయితే సికింద్రాబాద్, నారాయణ గూడ లాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేగానీ మరెక్కడా ఇటువంటి సందడి చోటు చేసుకోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అప్పటి వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేశారు.

కానీ శుక్రవారం యూనివర్సిటీకి సెలవుదినం కావడంతో విద్యార్థులు వేడుకలు నిర్వహించలేదని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి తెలిపారు. ఆమె చిన్నతనంలో స్వాతంత్ర్య విశేషాలను తన తల్లి దగ్గర తెలుసుకున్నట్లు  పేర్కొంది. తన తల్లి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లారట. అయితే అక్కడా ఎలాంటి సందడి కనిపించలేదని చెప్పినట్లు తెలిపారు. కొద్దిమంది రైల్వే ప్రయాణికులు తప్ప స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా మారినట్లు పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ నగరంలో మాత్రం కర్ఫ్యూ విధించినట్లు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో తమకూ స్వాతంత్ర్యం వస్తుందని ఆశగా ఎదురుచూశారు.

అప్పటి సమాచార ప్రసారం సాధనం రేడియో మాత్రమే. అయితే రేడియోలోనే స్వాతంత్ర్య విశేషాలను తెలపలేదు. ఎందుకంటే అది దక్కన్ మీడియా. నిజాం ప్రభుత్వానికి అనుగుణంగా మాత్రమే నడిచేది. దక్కన్ రేడియోలో రోజూవారీ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. కానీ స్వాతంత్ర్యం గురించి ఒక్కముక్క కూడా చెప్పలేదు. అయితే కొందరు విద్యావంతులు ఆల్ ఇండియా రేడియో, బీబీసీ రేడియోల ద్వారా స్వాతంత్ర్య వేడుకల గురించి తెలుసుకున్నారు.
Tags:    

Similar News