హైదరాబాద్ రేంజ్ ఎంతో చెప్పే తాజా డీల్

Update: 2021-03-14 10:30 GMT
వ్యాక్సిన్ తయారీలో భారత్ సత్తా చాటే డీల్ ఒకటి తాజాగా జరిగింది. దీనికి హైదరాబాద్ కు చెందిన కంపెనీ కావటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. భారత్.. అమెరికా.. జపాన్.. ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ గ్రూపు కోసం ఈ ఏడాది చివరికి 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే అద్భుతమైన అవకాశాన్ని హైదరాబాదీ కంపెనీ.. బయోలాజికల్ - ఈ (బీఈ) సంస్థ దక్కించుకుంది.

ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా సహా పలు కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని అమెరికా వైట్  హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాకు చెందిన సంస్థ టీకాల ఉత్పత్తి కోసం బయోలాజికల్  ఈ కంపెనీకి ఆర్థిక వనరుల్ని సమకూర్చనుంది. జపాన్ ప్రభుత్వానికి చెందిన జైకా కూడా భారత ప్రభుత్వానికి ఇందుకోసం రాయితీపై రుణాల్ని అందించనుంది.

పేద దేశాలకు టీకాల్ని ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన తోడ్పాటున డీఎఫ్ సీ.. జైకాలు అందించనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దక్కించుకున్న బీఈ సంస్థకు ప్రస్తుతం ఎండీగా మహిమ దాట్ల వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను 1953లో స్టార్ట్ చేయగా.. వ్యాక్సిన్ వ్యాపారంలోకి 1962లో అడుగు పెట్టింది. రెండేళ్ల క్రితం అంటే.. 2019లో అమెరికాలో వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజా డీల్ తో బీఈ రేంజ్ మరో స్థాయికి వెళ్లటమే కాదు..వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచ రాజధానిగా హైదరాబాద్ మారుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News