ఒక్క దెబ్బ‌తో 'దేవుడు' అయిపోయాడు

Update: 2017-06-19 14:59 GMT
కాస్త అటూఇటుగా మ‌రో నెల వ్య‌వ‌ధిలో దేశానికి కొత్త రాష్ట్రప‌తి రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తిగా అధికార‌ప‌క్షానికి చెందిన అభ్య‌ర్థి ఎవ‌రు కానున్నార‌న్న అంశంపై చాలానే చ‌ర్చ జ‌రిగింది. మీడియాలో ర‌క‌ర‌కాల పేర్లు తెర మీద‌కు వ‌చ్చాయి. అయితే.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌ నాథ్‌ ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు.

ఈ పేరు పెను సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే.. ఎవ‌రి ఊహ‌ల‌కు.. అంచ‌నాల‌కు అంద‌నిరీతిలో ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. దీంతో.. ఒక్క‌సారిగా రామ్ నాథ్ కోవింద్ ఎవ‌రు? ఆయ‌న పుట్టుపూర్వోత్త‌రాలు ఏమిట‌న్న దానిపై నెటిజ‌న్లు తీవ్ర ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అదే ప‌నిగా గూగుల‌మ్మ‌ను వెతుకుతున్నారు.

ఇలాంటి వెతుకులాట‌లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూడ‌ట‌మే కాదు.. ఇప్పుడ‌ది పెద్ద సంచ‌ల‌నంగా మారింది. మోడీకి.. ఆయ‌న‌కు జాన్ జిగిరి అయిన అమిత్ షాల‌కు మాత్ర‌మే తెలిసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ముచ్చ‌ట‌ను ఒక వ్య‌క్తి మూడు రోజుల ముందే అంచ‌నా క‌ట్టేశారు. ల‌లిత్ మిశ్రా అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ స‌రిగ్గా మూడు రోజుల కింద‌ట బిహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్ కోవింద్ పేరును రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా అంచ‌నా వేశారు.

ఇప్పుడు ఆయ‌న అంచ‌నా నిజం కావ‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అలా ఎలా అంచ‌నా వేశార‌న్న సందేహం ప్ర‌తిఒక్క‌రికి క‌లుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను కొంద‌రు దేవుడిగా కీర్తిస్తుంటే.. మ‌రికొంద‌రు రాష్ట్రప‌తి అభ్య‌ర్థి పేరును అంత క‌చ్ఛితంగా ఎలా అంచ‌నా వేశార‌న్న ప్ర‌శ్న‌ను ఆయ‌న‌కు సంధిస్తున్నారు. మ‌రికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి.. షేర్ మార్కెట్ ఫ‌లితాలు ఎలా ఉంటాయి? మ‌హారాష్ట్రలో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తాయా? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేశారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఇప్పుడాయ‌న ఒక్క‌సారిగా ట్విట్ట‌ర్‌లో ఫేమ‌స్ అయిపోయారు. మ‌రి.. ఇత‌గాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ప‌్ర‌ధాని మోడీ మ‌న‌సును అంత బాగా ఎలా చ‌ద‌వ‌గ‌లిగార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌లుగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News