మాస్ మహారాజ రవితేజ - కల్యాణ్ కృష్ణ కురసాలల కాంబోలో రామ్ తాళ్లూరి నిర్మించిన`నేల టిక్కెట్టు`సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరై సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ - పవన్ లకు కొన్నేళ్లుగా ఉన్న అనుబంధం కారణంగానే పవన్ ఆ వేడుకకు వచ్చారని టాక్ వచ్చింది. దాంతోపాటు పవన్ తో రామ్ తాళ్లూరికి ఉన్న సాన్నిహిత్యం కూడా పవన్ రాకకు కారణమని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, జనసేన తరఫున రామ్ పోటీ చేయబోతున్నారని పుకార్లు వచ్చాయి. తాజాగా `నేల టిక్కెట్టు` ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్...ఆ పుకార్లకు తెరదించారు. తాను జనసేనలో చేరడం లేదని, అసలు తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే, తనకు పవన్ అంటే అభిమానమని - ఆయన కోసం ఏమైనా చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏడాదిన్నర క్రితం తనకు పవన్ కల్యాణ్ తో పరిచయమైందని రామ్ చెప్పారు. తమ ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒకటి కావడంతో ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. తాను చారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా సమాజసేవ చేయడం పవన్ కు నచ్చిందన్నారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, జనసేనలో చేరబోనని చెప్పారు. తనకున్న వ్యాపారాలు, సినిమా నిర్మాణ సంస్థలకు సంబంధించిన విషయాలతో తాను బిజీగా ఉంటానని, అందువల్ల రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేసేందుకు సమయం ఉండదని అన్నారు. అయితే, జనసేనకు తాను ఏమీ చేయలేకపోవచ్చని.....పవన్ కల్యాణ్ కోసం ఏమైనా చేస్తానని చెప్పారు. ఇప్పటికైతే....జనసేనలో చేరడం, రాజకీయ అరంగేట్రంపై రామ్ క్లారిటీ ఇచ్చారు. అయితే, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి రాజకీయాల్లోకి వస్తారేమో వేచి చూడాలి మరి.