థర్డ్ వేవ్ పై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం

Update: 2021-06-27 03:30 GMT
దేశంలో ఊహించని పిడుగులా విరుచుకుపడ్డ కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగాన్ని వినిపించింది. ముఖ్యంగా యువతను భారీగా బలిగొంది. ఒకనొక దశలో శ్మశానాల ముందు క్యూలు,  వందల ఖననాలు కనిపించిన దృశ్యాలు మీడియాలో కలిచివేసాయి.

అయితే కఠిన లాక్ డౌన్ తో ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. మరి ఇంకా ఆ మహమ్మారి పోలేదు. డెల్టా ప్లస్ అంటూ కొత్తగా రూపాంతరం చెంది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో మూడో ముప్పుపై అందరిలోనూ భయాలు వెంటాడుతున్నాయి.

తాజాగా భారత కౌన్సిల్ ఆఫ్ మెడిసన్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన అధ్యయనం చేసింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ అవకాశాలు తక్కువేనని వెల్లడించింది. ఒకవేళ వచ్చినా రెండో దశ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.

ప్రస్తుత పరిస్థితులు , రాబాయే వేవ్ లను ఎదుర్కోవడంతో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ దోహదపడుతుందని ఐసీఎంఆర్ తెలిపింది.

ఐసీఎంఆర్, లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించారు.  రోగనిరోధక శక్తి క్షీణించడం.. రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా వైరస్ లో మార్పులు రావడం వంటి కారణాలు మూడో వేవ్ కు దారితీసే అవకాశాలు తక్కువేనని ఐసీఎంఆర్ తెలిపింది. రెండు సందర్భాల్లోనే మూడో వేవ్ తలెత్తడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

కొత్త వేరియంట్ అధిక సంక్రమణ శక్తి ఉండి.. అదే సమయంలో మన రోగనిరోధక శక్తిని తప్పించుకోగలిగితే థర్డ్ వేవ్ రావొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక సంక్రమణ తగ్గించగలిగే లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తే థర్డ్ వేవ్ ప్రబలవచ్చని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. ఈ రెండు కారణాల వల్ల ఒకవేళ మూడో వేవ్ వచ్చినా అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ తాజా నివేదిక బయటపడింది. ఈ నివేదికతో థర్డ్ వేవ్ తో భయపడుతున్న దేశ ప్రజలకు ఊరట కలిగినట్టైంది.
Tags:    

Similar News